30 March, 2026 | 3:31 PM

లావాదేవీల్లో జాప్యం వైన్స్ షాపుల మూసివేతతో కలకలం

30-03-2026 01:46 PM

ఇల్లందుటౌన్, (విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలోని గోవింద్ సెంటర్ ఏరియాలో ఉన్న పేరుగాంచిన వైన్స్ షాప్‌తో సహా పట్టణంలోని మరో మూడు వైన్స్ షాపులకు సంబంధించిన భాగస్వాముల మధ్య లావాదేవీల్లో జాప్యం నెలకొనడంతో వివాదం తలెత్తి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లెక్కలు పూర్తిగా వెల్లడించకపోతే షాప్‌లను ఓపెన్ చేయకూడదని భాగస్వాముల్లో ఒకరు స్పష్టంగా చెప్పి ఆదివారం దగ్గరుండి షాప్‌ను మూసివేయడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ప్రధాన కూడలిలో ఉన్న షాప్ సాధారణంగా రద్దీగా ఉండే సమయంలోనే ముందుగానే మూసివేయబడటంతో అక్కడికి వచ్చిన మందుబాబులు అయోమయంలో పడి వెనుదిరిగారు. షాప్ అకస్మాత్తుగా మూసివేయడంపై స్థానికుల్లో చర్చనీయాంశంగా మారగా ఈ వ్యవహారంలో రాజకీయ కోణం కూడా ఉందేమోనని మందుబాబులు గుసగుసలాడుతున్నారు. భాగస్వాముల మధ్య ఉన్న విభేదాలు పరిష్కారమయ్యే వరకు షాప్ తిరిగి ఎప్పుడు తెరుచుకుంటుందో అనుమానంగా మారింది.