5 April, 2026 | 3:36 PM

సుడాన్‌లో అంతర్యుద్ధం

04-11-2025 12:59 AM
  1. నగరాలపై రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ సాయుధ దాడులు
  2. ఆకలి దప్పులతో అల్లాడుతున్న ప్రజలు

ఖార్టూమా, నవంబర్ 3: సుడాన్‌లో అంతర్యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్) దళాలు తూర్పు దిశగా వెళ్తూ తమ దాడులను తీవ్రతరం చేశాయి. ఆర్‌ఎస్‌ఎఫ్ దాడుల కారణంగా దేశవ్యాప్తంగా వేలాది మంది పౌరులు తమ ఇళ్లను వదిలి ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని వలస బాట పడుతున్నారు. దీనిలో భాగంగానే తాజాగా డార్ఫూర్ ప్రాంతంలోని అల్-ఫాషర్ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. దాడుల కారణంగా ఇప్పటికే బారా, ఉమ్ రవాబా పట్టణాలు ఖాళీ అయ్యాయి.

1,200 మందికి పట్టణాలు విడిచి వెళ్లిపోయారు. త్వరలో నార్త్ కొర్డోఫాన్ ప్రాంతంలోని అల్-ఒబీద్ నగరాన్ని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నది. ఆర్‌ఎస్‌ఎఫ్ నేత మహ్మద్ హమ్దాన్ దగాలో నేతృత్వంలోని దళాలు అల్-ఒబీద్ వైపు ప్రయాణం ప్రారంభించాయి. నగరం ప్రస్తుతం సుడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నియంత్రణలో ఉంది. నగరానికి ఈశాన్య ప్రాంతంలో 50 కి.మీ దూరంలో ఆర్‌ఎస్‌ఎఫ్ దళాలు మోహరించి ఉన్నాయి. అంతర్యుద్ధం ఫలితంగా సూడన్‌లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ పౌరులు ఆకలి దప్పులతో అల్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా 3.75 లక్షల మంది దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆకలితో 63 లక్షల మంది అలమటిస్తున్నారు.