మినీ డంపింగ్‌యార్డ్‌లా.. చెన్నాపురం చెరువు
కాలుష్య కాసారంగా తటాకం
చెరువు కట్ట వెంబడి నిర్మాణ శిథిలాలు
ప్లాస్టిక్ వ్యర్ధాలతో గుట్టలుగా పరిసరాలు
జవహర్‌నగర్, ఆగస్టు 27 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పరిధిలోని చెన్నాపురం చెరువు కట్ట మినీ డంపింగ్ యార్డులా మారి అనకొండను తలపిస్తుంది. జిల్లాలోని అతిపెద్ద పూర్వపు మున్సిపల్ కార్పొరేషన్ గా గనుతి కెక్కిన జవహర్ నగర్ లోని వివిధ చెరువులు కాలుష్య కాసారంగా మారి ప్లాస్టిక్ వ్యర్ధాలతో గుట్టలుగా పరిసర ప్రాంతాలు మినీ డంపింగ్ లా మారిన తీరు వ్యవస్థలో లోపానికి అర్థం పడుతున్నాయి.
జవహర్ నగర్ పరిధిలోని చెన్నాపురం చెరువు కట్ట వెంబడి ఖాళీ స్థలాల్లో నిర్మాణ శిథిలాలు చెత్తాచెదారంతో ప్లాస్టిక్ వ్యర్ధాలు గుట్టలు గుట్టలుగా పడి తీవ్రమైన కాలుష్య కాసారంగా మారి చెత్తాచెదారంతో అనకొండ లాంటి గుట్టలను తలపిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు.
జవహర్ నగర్ లో వంద కాలనీలకు పైగా విస్తరించి ఉన్న జవహర్ నగర్ గ్రామపంచాయతీ నుండి మేజర్ గ్రామపంచాయతీ వరకు తరువాత మున్సిపాలిటీ గా ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ గా విస్తరించినప్పటికీ పారిశుద్ధ్య నిర్వహణలో మున్సిపల్ అధికారుల అలసత్వంతో చెరువు దాని పరిసరాలు దుర్గంధం వెలువడుతూ వైతరణి నదిని తలపిస్తున్నాయి. పేరుకే పెద్ద కార్పోరేషన్ గా అవతరించినప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో మున్సిపల్ యంత్రాంగం విఫలమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇటీవలే గ్రేటర్ మున్సిపల్ లో విలీనమైనా అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉందని ప్రజల ఆరోపణ. జవహర్ నగర్ రాజకీయంగా ప్రస్తుతం స్తబ్దంగా ఉండి రాజకీయ వైచిత్రి అగమ్య గోచరంగా తయారైంది. కీసర సర్కిల్లో అతిపెద్ద డివిజన్ గా జవహర్ నగర్ చంద్రపురి కాలనీ వెలసినా అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉందని స్థానికుల ఉవాచ. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే లీచెట్ నీరు చేరడంతో చెరువు నీరు ఇప్పటికే నల్లగా మారి విషతుల్యమైంది.
దానికి తోడు ఇప్పుడు చుట్టుపక్కల వెలువబడుతున్న వ్యర్ధాల గుట్టల కారణంగా దుర్వాసన దోమల బెడద తీవ్రమవడంతో స్థానికులు నరకయాతన పడుతున్నారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా చెరువు నుంచి వెలువడే లేచెట్ పదార్థాల లోని విషతుల్యమైన అర్సనిక్ కాడ్మియం, సీసం, కోబాల్ట్, నికెల్, తదితర రసాయన పదార్థాలు చెరువులో కలవడం వల్ల జీవవైవిద్యం తీవ్రంగా దెబ్బ తినడంతో పాటు చెరువులో జలచర రాశులు మత్స్య సంపద కాలుష్య కాసారానికి బలై జీవవైవిద్యం పూర్తిగా దెబ్బతిన్నదని జవహర్ నగర్ ప్రజలు ఆరోపిస్తున్నారు. పచ్చదనానికి స్వచ్ఛ తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం జవహర్ నగర్ లోని చెన్నాపురం చెరువుతోపాటు ఇతర చెరువుల శుద్ధికి స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలని జవహర్ నగర్ ప్రజలు కోరుకుంటున్నారు.
ఒకప్పుడు ఈ చేరువే తాగునీటికి ఆధారం..
పూర్వపు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న చెన్నాపురం చెరువు ఒకప్పుడు తాగునీటికి ఆవాసం గా మారిందని, నేడు ఆ చెరువు కాలుష్య పు కొరలో చిక్కుకొని, కాలుష్య కాసార ంగా మారి నీరు విషతుల్యమై జీవావరణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని పంటలకు కూడా పనికిరాకుండా పోయింది. ప్రభు త్వం ఇప్పటికైనా స్పందించి ఈ చెరువును పునరుద్ధరించి తిరిగి తాగునీరుకు అనువైన చెరువుగా మార్చాలి.
మేకల కావ్య (జవహర్ నగర్ మాజీ మేయర్, బిఆర్‌ఎస్ నేత)
మినీ ట్యాంక్ బండ్‌లా తీర్చిదిద్దుతాం
ప్రధాన రహదారికి దగ్గరలో ఉన్న చెన్నాపురం చెరువును త్వరలోనే మినీ ట్యాంక్ బండ్ లా తీర్చి దిద్దుతాం. చెరు వు కాలుష్యం కోరల నుండి విముక్తం కావడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రజలు పరిసరాల పట్ల అవగాహన కలిగి ఉండి చెత్తాచెదారం డంపింగ్ బిన్ ల లోనే వేస్తూ స్వచ్ఛతకు పాటుపడండి.
తోటకూర వజ్రేష్ యాదవ్ (జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు)
ప్రతిపాదనలు పంపించాం
చెరువు పునరుద్ధరణకు శుద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని త్వరలోనే చెరువు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుంది.
నాయకం భాస్కర్ పటేల్,
(కాంగ్రెస్ యువ నాయకులు, గాంధీనగర్ కాలనీ)






