28 August, 2026 | 9:52 AM

అద్దె భవనంలో ‘గ్రంథాలయం’..!

28-08-2026 12:51 AM

ఊసే లేని స్వంత భవనం ఏర్పాటు

వెంకటాపూర్, ఆగస్టు 27 (విజయక్రాంతి): వెంకటాపూర్ మండల కేంద్రంలో గ్రంథాలయం పరిస్థితి దయనీయంగా మారింది. ఇరుకైన అద్దె భవనంలో అరకొర సౌకర్యాలతో కొనసాగుతున్న గ్రంథాలయం పాఠకులు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువతకు ఏమాత్రం ఉపయోగపడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రశాంతంగా చదువుకునేందుకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు గ్రంథాలయమే ప్రధాన ఆధారం కాగా, ప్రస్తుత పరిస్థితులు వారిని నిరాశకు గురిచేస్తున్నాయి.

అద్దె భవనంలో అసౌకర్యం 

ములుగు జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న వెంకటాపూర్ మండల కేంద్రంలో ఇప్పటికీ అద్దె భవనంలోనే గ్రంథాలయం కొనసాగుతోంది. ఇరుకైన గదులు, పరిమిత సీటింగ్ సదుపాయం, అవసరమైన పుస్తకాల కొరత వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో యువత గ్రంథాలయాన్ని వినియోగించుకోవడానికి ఆసక్తి చూపడం లేదని పలువురు పేర్కొంటున్నారు. మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి నిత్యం విద్యార్థులు, నిరుద్యోగులు వస్తున్నప్పటికీ చదువుకునేందుకు అనువైన వాతావరణం లేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఇళ్లలోనే చదువుకుంటుండగా, మరికొందరు దూర ప్రాంతాల్లోని స్టడీ హాళ్లను ఆశ్రయిస్తున్నారు.

పోటీ పరీక్షల అభ్యర్థులకు తప్పని తిప్పలు

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రస్తుతం పెద్ద సంఖ్యలో యువత పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు, సాధారణ జ్ఞానం, కరెంట్ అఫైర్స్, పాఠ్యపుస్తకాలు, మోడల్ ప్రశ్నపత్రాలు వంటి వాటిని అధ్యయనం చేసేందుకు గ్రంథాలయం ఎంతో కీలకం. అయితే వెంకటాపూర్ గ్రంథాలయంలో అవసరమైన సౌకర్యాలు లేకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో గంటల తరబడి చదువుకునే అవకాశం లేకపోవడం తమ సన్నద్ధతపై ప్రభావం చూపుతోందని యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది.

రెండేళ్ల క్రితం ఇచ్చిన హామీ ఏమైంది.?

గతంలో గ్రామపంచాయతీ పరిధిలో గ్రంథాలయానికి ప్రత్యేక భవనం ఉండేది. ఆ భవనం శిథిలావస్థకు చేరడంతో ప్రస్తుతం అద్దె భవనంలో గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారు. అయితే అద్దె భవనంలోనూ కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు రెండేళ్ల క్రితం మండల కేంద్రానికి చెందిన యువకులు, విద్యార్థులు, పాఠకులు నూతన గ్రంథాలయ భవనం నిర్మించాలని కోరుతూ ములుగు జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ రవిచందర్ కు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఆయన త్వరలోనే నూతన భవనం నిర్మించి గ్రంథాలయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చినట్లు యువత పేర్కొంది. అయితే రెండేళ్లు గడిచినా ఆ హామీ కార్యరూపం దాల్చకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

నూతన భవనం నిర్మించాలి

విద్యార్థులు, నిరుద్యోగులు, యువత, పాఠకులకు ఉపయోగపడేలా మండల కేంద్రంలో అన్ని సౌకర్యాలతో కూడిన నూతన గ్రంథాలయ భవనం నిర్మించాలి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి స్థలం కేటాయించి, భవన నిర్మాణ పనులు ప్రారంభించాలి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ప్రత్యేక స్టడీ హాల్, సరిపడా పుస్తకాలు, తాగునీరు, విద్యుత్, కూర్చునే సదుపాయాలు కల్పించి గ్రంథాలయాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి.

పంబిడి శ్రీధర్ రావు, పాఠకుడు