పత్తి రైతులకు కేంద్రం షాక్!
- విదేశీ పత్తికి 11 శాతం సుంకం ఎత్తివేత
- భారీగా తగ్గనున్న స్వదేశీ పత్తి ధరలు
- మద్దతు ధర కంటే క్వింటాకు 2 వేల వరకు తగ్గే అవకాశం
- 40 లక్షల బేళ్ల వరకు విదేశీ పత్తి దిగుమతికి ఛాన్స్
- క్వింటా పత్తికి 10 వేల మద్దతు ధర ఇవ్వాలని రైతు సంఘాల డిమాండ్
హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): దేశంలో వరి తర్వాత ఎక్కువగా ఉత్పత్తి చేసే పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. విదేశీ పత్తికి కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం ఎత్తివేయడంతో పత్తి రైతుల్లో ఆందోళన మొదలైంది. విదేశీ పత్తికి విధించే 11 శాతం దిగుమతి సుంకం జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ సుంకం ఎత్తివేయడం వల్ల తక్కువ ధరకు లభించే విదేశీ పత్తినే టెక్స్‌టైల్స్ కంపెనీలు ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంది.
దేశ వ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది రైతులు పత్తి సాగు చేస్తున్నారు. తెలంగాణలోనే 10 లక్షల మంది రైతులు దాదాపు 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పత్తికి మద్దతు ధర రూ.8,267 ప్రకటించి కేంద్రం కొనుగోలు చేసింది. ఖరీఫ్‌కు రూ.8,500 వరకు మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే విదేశీ పత్తికి 11 శాతం దిగుమతి సుంకం ఎత్తివేయడం వల్ల స్వదేశీ పత్తికి కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు తగ్గనుంది.
అయితే స్వామినాథన్ కమిషన్ నివేదిక ఆధారంగా క్వింటా పత్తికి రూ.10,075 మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సి ఉండగా, కేంద్రం స్వామినాథన్ కమిషన్ నివేదికను పూర్తిగా అమలు చేయడం లేదనే విమర్శలున్నాయి. అయితే, ఈ ఖరీఫ్‌లో విదేశాల నుంచి దాదాపు 40 లక్షల పత్తి బేల్లు దిగుమతయ్యే అకాశం ఉందని వ్యవసాయరంగ నిపుణులు చెపుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాల రైతులతో పోలిస్తే భారతీయ పత్తి రైతులలో అత్యధికులు చిన్న, సన్నకారు రైతులే.
విదేశాల్లో రైతులకు ఎక్కువగా ప్రోత్సాహకాలు ఉండటంతో పత్తితో పాటు ఇతర పంటల ఉత్పత్తికి ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. తద్వారా పత్తి కూడా తక్కువ ధరకు లభిస్తుంది. ఇటీవలే (ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 26 వరకు) సుంకం మినహాయింపు ప్రకటించిన వెంటనే 3 శాతం వరకు పత్తి ధర తగ్గిందని, దీంతో తీవ్ర నష్టం జరిగిందని రైతులు చెపుతున్నారు. ఇప్పుడు వచ్చే ఖరీఫ్ సీజన్‌లోనూ స్వదేశీ పత్తి ధర భారీగా పడిపోనుందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
సీసీఐకి కూడా నష్టమే
పత్తిపై దిగుమతి సుంకం ఎత్తివేయడం వల్ల పత్తి రైతులతో పాటు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పటికే రైతుల నుంచి సీసీఐ కనీస మద్దతు ధరకే పత్తిని కొనుగోలు చేసింది. ఇప్పుడు విదేశీపత్తి ధర తగ్గితే అదే ధరకు సీసీఐ కూడా టెక్స్‌టైల్స్ కంపెనీలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. తద్వారా రైతు మద్దతు వ్యవస్థలను బలహీనపరిచినట్టే అవుతుంది. పత్తి దిగుమతిపై 11 శాతం సుంకం యథావిధిగా అమలు చేయాలి.
తీగల సాగర్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి






