4 April, 2026 | 6:05 PM

జనగణన కార్యక్రమాన్ని పూర్తి చేయాలి

04-04-2026 04:20 PM

దుబ్బపల్లి, చిన్నకల్వల గ్రామాలలో పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

సుల్తానాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో జరుగుతున్న జనగణన కార్యక్రమాన్ని కచ్చితత్వంతో, సమగ్రంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దుబ్బపల్లి, చిన్నకల్వల గ్రామాలలో జరుగుతున్న జనగణన  ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ... హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లకు సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్‌ను తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు.

గ్రామ స్థాయిలో ల్యాండ్‌ మార్క్‌లు, పాఠశాలలు, దేవాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు తదితర గుర్తులను బ్లాక్ వారీగా స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. హౌస్ లిస్టింగ్ బ్లాక్‌కు సంబంధించిన వివరాలు ఖచ్చితమైన సమాచారంతో సిద్ధం చేసి సమర్పించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట తహసిల్దార్  బషిరుద్దీన్, ఎంపీడీవో దివ్యదర్శన్ రావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.