23 August, 2026 | 4:10 PM

ఇల్లందు రైల్వే పునరుద్ధరణకు బీఆర్‌ఎస్‌ మద్దతు

23-08-2026 03:37 PM

ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లందులో గతంలో ప్రజలకు అందుబాటులో ఉన్న రైల్వే సేవలను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ కంచర్ల శ్రీనివాస్‌ చేపట్టిన రిలే దీక్షకు బీఆర్‌ఎస్‌ ఇల్లందు నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ.. ఇల్లందు ప్రాంతానికి రైల్వే సేవలు ఎంతో కీలకమని, రైల్వే రవాణా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైల్వే సేవలు పునరుద్ధరిస్తే ప్రాంత అభివృద్ధితో పాటు ప్రజల రవాణా సౌకర్యం, వ్యాపార కార్యకలాపాలు మరింత విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కంచర్ల శ్రీనివాస్‌ చేపట్టిన రిలే దీక్షకు బీఆర్‌ఎస్‌ ఇల్లందు తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, ఇల్లందు రైల్వే పునరుద్ధరణ కోసం ప్రజల పక్షాన తమ వంతు పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. రైల్వే శాఖ, కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇల్లందు రైల్వే సేవలను వెంటనే పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రైల్వే పునరుద్ధరణ కోసం కొనసాగుతున్న ఉద్యమానికి ప్రజలు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు మద్దతుగా నిలవాలని బీఆర్‌ఎస్‌ నాయకులు పిలుపునిచ్చారు.