22 March, 2026 | 5:54 PM

బీఆర్ఎస్ అంటే బోగస్ రాష్ట్ర సమితి

22-03-2026 04:12 PM

తప్పులు చేశారు.. అప్పులు చేశారు.. అందుకే ఈ దుస్థితి

షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"

షాద్ నగర్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ హయాంలో చేసినట్లు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా అంకెలగారడీ చేయలేదు.. విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేశాం.. అన్ని రంగాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ను ప్రజాప్రయోజనకరంగా తీర్చిదిద్దాం.. అయినా సిగ్గు తప్పి చెవిలో పువ్వులు పెట్టుకొని బిఆర్ఎస్ నాయకులు తిరుగుతున్నారు.. పదేళ్ల పాటు ప్రజల చెవిలో పువ్వులు పెట్టారు.. ఇప్పుడు తమ చెవుల్లో పెట్టుకొని తిరుగుతున్నారు ‌.. అంటూ షాద్ నగర్ ఎమ్మెల్యే  వీర్లపల్లి శంకర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల తీరుపై సెటైర్లు వేశారు.

ఆదివారం షాద్ నగర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే సిగ్గేస్తుందని అన్నారు.  తప్పులు .. అప్పులు చేసి ప్రజలను పూర్తిస్థాయిలో అగాధంలోకి నెట్టిన చరిత్ర ఆ పార్టీదని అన్నారు. వాళ్లు చేసిన పొరపాట్లను ఒక్కొక్కటిగా సవరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనను ముందుకు తీసుకువెళుతుందని అన్నారు. బీఆర్ఎస్ అంటేనే "బోగస్ రాష్ట్ర సమితి" అని ఆయన విమర్శించారు. మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్లు వీళ్ళను చూస్తే నవ్వు వస్తుందని అన్నారు.

రాష్ట్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అట్టడుగు వర్గాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య బద్ధంగా రాజ్యాంగానికి లోబడి పని చేస్తుంటే ప్రతిపక్షాలు అవాక్కలు చవాకులు పేలుతున్నారని విడ్డూరంగా ఉందన్నారు. విద్యా, వైద్యం అత్యంత ఖరీదైనదిగా మారిన తరుణంలో ప్రక్షాళన కోసం సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారని అన్నారు. ఏకీకృత పాఠశాలలు, మెస్ చార్జీల పెంపకం, మధ్యాహ్న భోజనం, ఐఐటి, పాలిటెక్నిక్ కళాశాలల మంజూరులు ఇందులో భాగమని అన్నారు.

చిన్నపిల్లలకు కూడా పౌష్టికాహారం అందాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తుంది అన్నారు. 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని అత్యంత దరిద్రంగా మార్చి 8.50 లక్షల కోట్ల అప్పులు గత ప్రభుత్వం చేసిందని, దానికి నెలకు 50 కోట్ల చొప్పున వడ్డీ చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఒక వర్గం మాత్రమే ఆధిపత్యం చెలాయిచిందని అన్నారు.

డ్రగ్స్ రాజ్యాన్ని సృష్టించారు

గతంలో బంగారు తెలంగాణను తీసుకువస్తామని హామీ ఇచ్చిన బీఆర్ఎస్ నాయకులు డ్రగ్స్ సామ్రాజ్యాన్ని సృష్టించారని, యువత జీవితాలను నాశనం చేశారని ఆరోపించారు. ఆ పార్టీలోని అత్యంత కీలక నేత దీనికి నాయకత్వం వహించడం సిగ్గుచేటని అన్నారు. ఈ రోజున కూడా ఆ పార్టీకి చెందిన నాయకులు డ్రగ్స్ విషయంలో పట్టుబడుతున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం పాలన మీద మాత్రమే ప్రభుత్వం దృష్టి పెట్టిందని, ఇలాంటి దందాలు చేసే నాయకులకు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

డ్రగ్స్ తో సమాజాన్ని నాశనం చేయడమే కాకుండా మట్టి, ఇసుక, భూమి, మైనింగ్.. ఇలా అన్నింటిని దోచుకున్నారని ధ్వజమెత్తారు. వీరు సృష్టించిన డ్రగ్స్ కల్చర్ ఇప్పటికీ కొనసాగుతుండడం దురదృష్టకరమని అన్నారు. ఎవరు ఏమి విమర్శించిన ప్రభుత్వం మాత్రం ప్రజల కోసమే పని చేస్తుందని, ప్రస్తుతం రైతు భరోసా, రైతు బీమా కార్యక్రమాల ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు సాగుతుందని వెల్లడించారు.

కాంగ్రెస్ నేతలు, రఘునాయక్ ,చల్లా శ్రీకాంత్ రెడ్డి, కొందుర్గు మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి,  గిరిజన నేత రఘునాయక్, బాలరాజు గౌడ్, కేశంపేట మండల పార్టీ అధ్యక్షుడు వీరేశం, కొత్తూరు మండల పార్టీ అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి, కొత్తూరు పట్టణ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, ఆగిరి రవికుమార్ గుప్తా, మాజీ ఎంపీటీసీ కుమార్ గౌడ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు..