24 June, 2026 | 2:05 PM

కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి

24-06-2026 12:57 PM

ఇల్లందు టౌన్, జూన్ 24 (విజయక్రాంతి): ఇల్లందులో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో చేసిన ప్రసంగాలను వక్రీకరించి కాంగ్రెస్ నాయకులు అనవసర ఆరోపణలు చేయడం బాధాకరమని బీఆర్ఎస్ నాయకుడు యలమద్ది రవి అన్నారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ సభలో ఎమ్మెల్యే కోరం కనకయ్యపై ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ హయాంలో ఇల్లందు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని మాత్రమే ప్రస్తావించామని తెలిపారు.

బీఆర్ఎస్ పాలనలో కూరగాయల మార్కెట్, మినీ స్టేడియం, బస్ డిపో, 100 పడకల ఆసుపత్రి, అంబేద్కర్ భవన్, కొమరం భీమ్ భవన్, బంజారా భవన్, యుటిలిటీ సెంటర్, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, రోడ్ల నిర్మాణం, గ్రామాల్లో సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యాలు తదితర అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని, రైతు భరోసా, కౌలు రైతుల సహాయం, పెన్షన్ల పెంపు, మహిళలకు ఆర్థిక సహాయం, కళ్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం, ఆడపిల్లలకు స్కూటీల వంటి హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాంగ్రెస్ నాయకుల ప్రాధాన్యత కావాలని సూచించారు.