బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి
కౌన్సిలర్లు బర్రె పూజిత, జాలిగం విఘ్నేష్
ఆలేరు,(విజయక్రాంతి): భువనగిరి పట్టణంలో ఈ నెల 30న ఆదివారం జరగనున్న బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని 22, 23వ వార్డుల కౌన్సిలర్లు బర్రె పూజిత, జాలిగం విఘ్నేష్ కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. 22వ వార్డులోని నల్లపోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ దేవాలయాలతో పాటు 23వ వార్డులోని కోట మైసమ్మ, మమ్మాయమ్మ, మారెమ్మ, పోతలింగాల దేవాలయాల వద్ద, అలాగే ఎల్‌బీ నగర్‌లోని పోచమ్మ దేవాలయం పరిసరాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరారు. భక్తులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన లైటింగ్, సౌండ్ సిస్టం తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. భోనాల ఉత్సవాలు ప్రశాంతంగా, వైభవంగా జరిగేలా మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కౌన్సిలర్లు కోరారు.






