calender_icon.png 11 February, 2026 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్లో తిరుగులేని శక్తిగా బిజెపి

10-02-2026 07:57:44 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ జనం గుండెల్లో ఉందని, వరుసగా రెండుసార్లు జరిగిన కరీంనగర్  పార్లమెంట్ ఎన్నికల్లో  ప్రజలు బీజేపీకి  బ్రహ్మరథం పట్టి, బండి సంజయ్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించారని, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బిజెపి అభ్యర్థులు మల్కా కొమరయ్య, అంజి రెడ్డిలను ఆశీర్వదించి గెలిపించారని, బిజెపి జనం గుండెల్లో ఉందనడానికి పార్లమెంటు, ఎమ్మెల్సీ ఫలితాలే నిదర్శనమని,

నేడు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పట్టణ ప్రజలంతా  బిజెపి వైపు ఉన్నారని, కార్పొరేషన్ ఫలితాల అనంతరం కరీంనగర్లో బిజెపి తిరుగులేని శక్తిగా అవతరించనుందని  బిజెపి జిల్లా అధికార ప్రతినిధి, సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర  తెలిపారు. మంగళవారం రోజున కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ  11న జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి విజయ కేతనం ఎగురవేస్తుందని, కరీంనగర్ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుని, బల్దియాపై కాషాయ జెండా ఎగరవేసి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రెండేళ్లయిన నగరపాలక సంస్థ అభివృద్ధి గురించి పట్టించుకోని , కార్పొరేషన్ కు  ఓక్క పైసా ఇవ్వని కాంగ్రెస్  ప్రభుత్వ పాలన  తీరుపై   పట్టణ ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారన్నారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది  గుండు సున్న...  నేడు ఈ ఎన్నికల్లో   40 సీట్లు  గెలుస్తామని  కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేయడం  హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, గడిచిన రెండేళ్లలో ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేదనే భావన  ప్రజల్లో ఏర్పడిందన్నారు. అందుకే మున్సిపల్ కార్పొరేషన్ లో  గట్టెక్కడానికి  చీకటి స్నేహితులు  ఎంఐఎంతో  లోపాయి కారి ఒప్పందం చేసుకొని, మైనార్టీ ఓట్లతో గట్టెక్కడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. 

ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే  ఆశతో అనేక   రాజకీయ డ్రామాలు చేస్తుందన్నారు. అలాగే బి ఆర్ ఎస్ పార్టీకి ఎన్నికల్లో ఓటు వేయడం దండగని, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కరీంనగర్ అభివృద్ధి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. నేడు అధికారంలో లేని బిఆర్ఎస్ కు ఓటు వేసి ప్రజలు నష్టపోవద్దని, డివిజన్ అభివృద్ధిని ప్రమాదంలోకి  నేట్టవద్దన్నారు. గతంలో కాంగ్రెస్ , బి ఆర్ ఎస్ లకు నగరపాలక సంస్థ అధికారాలను అప్పగించిన కరీంనగర్కు  ఓరగా బెట్టిందేమీ లేదన్నారు.

అందుకే నేడు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఐఎం, బిఆర్ఎస్ లకు తగిన బుద్ధి, గుణపాఠం చెప్పాలన్నారు.   కరీంనగర్ అభివృద్ధి కేవలం బిజెపితోనే సాధ్యమని, కరీంనగర్ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం,  కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్  కట్టుబడి ఉన్నారన్నారు. కరీంనగర్ భవిష్యత్తు , అభివృద్ధి కోసం బిజెపి అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.