భవిష్యత్తులో భీమదేవరపల్లి ఎల్కతుర్తి మరింత అభివృద్ధి
ముల్కనూర్‌లో ఆసుపత్రి ప్రారంభించిన మంత్రి
13 కోట్ల బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
హనుమకొండ జిల్లా జులై 6: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి ఎల్కతుర్తి మండలాలు భవిష్యత్తులో అభివృద్ధిలో మరింత ముందంజలో నిలుపుతామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
సోమవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి జంక్షన్ వద్ద మడిపల్లి నుండి ఎల్కతుర్తి జంక్షన్ వరకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ. 13 కోట్లతో చేపట్టిన బీటి రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, కుడా హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజీలతో కలసి సోమవారం శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను ప్రారంభించారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రహదారి నిర్మాణం పూర్తయితే గ్రామాలకు మండల కేంద్రానికి రహదారి అనుసంధానం (కనెక్టివిటీ) పెరుగుతుందన్నారు. ఎల్కతుర్తి మండల కేంద్రానికి కోర్టు, విద్యుత్ ఉపకేంద్రం, తహసీల్దార్ కార్యాలయాలు వస్తున్నాయన్నారు. తద్వారా ఎల్కతుర్తి మరింత అభివృద్ధిని భవిష్యత్తులో సాధిస్తుందన్నారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు.
ఛైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ రహదారి నిర్మాణంతో కనెక్టివిటీ పెరిగి గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, సీపీవో అజిత్ రెడ్డి లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఎల్కతుర్తి నుండి దామెర వెళ్లే ప్రధాన రహదారిని మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సత్వర చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి స్వర్గీయ బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్కతుర్తి సర్పంచ్ లావణ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజీ, ఉప సర్పంచ్ రాజు, హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, కుడా సిపిఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, తహసిల్దార్ ప్రసాదరావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.






