పంట వ్యర్థాలను దహనం చేయకండి.. రైతులకు డిప్యూటీ సీఎం కీలక సూచన
హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం నాడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా గంభీరరావుపేటలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్(Compressed Biogas Plant)కి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ... సమాజానికి ఆహారంతో పాటు ఆరోగ్య కరమైన గాలి అందించాల్సిన బాధ్యత రైతులపై ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
పంట వ్యర్థాలను దహనం చేయకుండా బయో గ్యాస్ ప్లాంట్ కు అందించాలని సూచించారు. పామాయిల్ పంటకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని వెల్లడించారు. ఎంఎస్ పీ కింద మొత్తం పంటను కేంద్రం కొనాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఎంఎస్ పీ ఇచ్చి కొన్ని పంటలను కేంద్రం కొనడం లేదని ఉప ముఖ్యమంత్రి ఆరోపించారు. రైతులను న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అనేక కార్యక్రమాలతో రాష్ట్రంలోని రైతులను ఆదుకుంటున్నామని తెలిపారు.






