బెల్ట్‌షాప్‌ల ఆ(ప)లేరు!
- నియోజకవర్గ వ్యాప్తంగా 200 పైనే బెల్ట్ షాపులు
- ప్రతి గ్రామంలో 4-5 పైనే
- యధేచ్చగా విక్రయాలు
- పనిలో పనిగా గంజాయి, గుట్కా అమ్మకాలు
- మొద్దునిద్రలో ఎక్సైజ్ శాఖ
- బెల్ట్ షాపులను అరికట్టాలని ప్రజల వేడుకోలు
ఆలేరు, జూన్ 7: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలోని ఐదు మండలాలలో మద్యం ఏరులైపారుతుంది. గ్రామగ్రామాన బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వెలిసి యథేచ్ఛగా మద్యం విక్రయాలు కోనసాగిస్తున్నాయి. సాయంత్రం 5 గంటలు దాటితే చాలు, కిరాణా షాపులు, టిఫిన్ బండ్లు, పాన్ షాపుల పేరుతో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో గ్రామాలలో మందుబాబులు ఆగడాలకు అడ్డులేకుండా పోయింది.
200ల పైనే బెల్ట్ షాప్‌లు!
ఆలేరు పట్టణంతో పాటు మండలంలోని ఆలేరు, మోటకొండూర్, రాజపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల పరిధిలో ఒక్కొక్క గ్రామంలో 4 నుండి 5 షాపుల ఏర్పాటుతో మొత్తం 200కి పైగా బెల్ట్ షాపులు నడుస్తున్నట్లు సమాచారం. ఇన్ని అక్రమ షాపులు ఉన్నాయని ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలిసినా కానీ చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొందరు స్థానిక నేతల అండదండలతోనే ఈ దందా సాగుతోందని పలువురు బహిరంగంగానే చెబుతుండడం గమనార్హం. ఇన్ని బెల్ట్ షాపుల నిర్వహణతో ఇది ’బెల్ట్ షాపుల ఆలేరు’గా ఎప్పుడో మారిపోయిందని పలువురు తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు.
గంజాయి, గుట్కా అమ్మకాలు
ఈ బెల్ట్ షాపుల్లో మద్యంతో పాటు నిషేధిత గంజాయి, గుట్కాలు కూడా విక్రయిస్తు న్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. యువత ఈ మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరీ కొన్ని బెల్ట్ షాప్ లు స్కూళ్లు, గుడుల పక్కనే ఏర్పాటు చేసి బహిరంగంగానే అమ్మకాలు చేస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
పట్టించుకునే వారు కరువు
గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాప్‌ల ఏర్పాటుతో యువతకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్న కారణంగా చాలా మంది చిన్న వయసులోనే మద్యంకు ఆకర్షితులై చెడిపోతున్నారు. ఇక గ్రామాలలో మందుబాబుల ఆగడాలకు అడ్డు,అదుపులేకుండా పోతుంది. సాయంత్రం అయితే తాగుబోతులతో రోడ్లపై నడవలేని పరిస్థితి.
ఈ ఇబ్బందులు భరించలేక పోలీస్ లకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆలేరుకు చెందిన ఓ మహిళ బాహాటంగా చెప్పడంతో ఈ సమస్య ఎంత జటిలంగా ఉందనేది స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికైనా జిల్లా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆలేరు నియోజకవర్గంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి బెల్ట్ షాపులను మూయించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్టలు వేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఫిర్యాదులు అందితే చర్యలు తీసుకుంటాం
ఆలేరు నియోజకవర్గంలోని ఏ గ్రామం నుండి మాకు ఫిర్యాదు రాలేదు. అసలు సమాచారం కూడా మా దృష్టికి రాలేదు. బెల్ట్ షాపుల నిర్వహణకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
దీపిక, ఎక్సైజ్ సీఐ, ఆలేరు






