ఆర్టీసీ కార్గోలో సారా తయారీ పటిక
రవాణా అయిన నాలుగు బస్తాలపై అనుమానాలు
క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు
కోదాడ, జాన్ 4: జిల్లాలోని కోదాడలో ఆర్టీసీ కార్గో కేంద్రానికి చేరుకున్న నాలుగు బస్తాల అనుమానాస్పద సరుకు కలకలం రేపింది. రాజమహేంద్రవరం నుంచి కోదాడకు రవాణా అయిన ఈ బస్తాల్లో సారా తయారీలో వినియోగించే పటిక ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం నాలుగు బస్తాల్లో సుమారు 200 కిలోల మేర పటిక ఉన్నట్లు సమాచారం.
ఆర్టీసీ కార్గో కేంద్రంలో సరుకు దిగిన అనంతరం దాని స్వభావంపై అనుమానాలు వ్యక్తం కావడంతో నిఘా సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం వాటిని కార్గో కేంద్రం నుంచి నిఘా, భద్రతా శాఖ కార్యాలయానికి తరలించి పరిశీలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ సరుకు పంపిన వ్యక్తిగా సింహాద్రి, స్వీకరించాల్సిన వ్యక్తిగా రవి పేర్లు నమోదైనట్లు తెలిసింది. అయితే బుకింగ్ సమయంలో నమోదు చేసిన ఫోన్ నంబర్కు అధికారులు పలుమార్లు సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నట్లు సమాచారం.
గతంలో ఇదే పేర్లతో లేదా ఇదే చిరునామాలతో ఇలాంటి సరుకులు రవాణా అయ్యాయా అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు. సరుకు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు యజమానులు ఎవరు, ఎవరికి పంపించారు, దాని వినియోగం ఏమిటి అనే అంశాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. పటికను అక్రమ మద్యం తయారీలో వినియోగించే అవకాశం ఉండటంతో అధికారులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.






