బ్యాంకర్లు రుణ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధించాలి
జిల్లా కలెక్టర్ కె. హరిత
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధించి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ కె.హరిత బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన 2025–26 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక రుణాల సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రాధాన్యత రంగాల రుణాలు, ప్రధానమంత్రి ముద్ర రుణాలు, ఎస్సీ–ఎస్టీ అభివృద్ధి రుణాలు, స్వయం ఉపాధి పథకాలు, విశ్వకర్మ, జన సురక్ష పథకాలను వేగంగా అమలు చేయాలని సూచించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,023 కోట్ల రుణ లక్ష్యాలకు గాను ఇప్పటివరకు రూ.1,581 కోట్లు (49 శాతం) మంజూరైనట్లు తెలిపారు. అనంతరం 2026–27 ఆర్థిక సంవత్సరానికి నాబార్డ్ రూపొందించిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో బ్యాంకుల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




