20న హక్కుల సాధన కోసం బంద్
తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు
ముషీరాబాద్, మే18 (విజయక్రాంతి): దేశ వ్యాప్తంగా ఉన్న 12 లక్షల మెడికల్ షాప్ నిర్వాహకుల హక్కుల సాధన, ఉనికి, భవిష్యత్ కోసం అలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్, డ్రగ్గిస్ట్స్ పిలుపు మేరకు ఈనెల 20న దేశ వ్యాప్తంగా సమ్మె తలపెట్టినట్లు తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ తెలిపింది. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఛాంబర్ అధ్యక్షుడు గీసులాల్ జైన్ పలు డిమాండ్లతో కూడిన బ్రోచర్ ను ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ మోడీ, కోశాధికారి ఆనంద్ కుమార్ గౌడ్‌తో కలసి విడుదల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో మందుల అక్రమ అమ్మకాలను నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నియంత్రించి నకిలీ మందుల అమ్మకాలు నివారించాలని డిమాండ్లతో ఒకరోజు బంద్‌కు పిలుపునిచ్చినట్లు చెప్పారు. జి.ఎస్.ఆర్.220(ఇ), 817(ఇ)ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డా.ఘీసూలాల్ జైన్, సూర్య ప్రకాష్, వికాస్ అగర్వాల్, మనీష్ అగర్వాల్ పాల్గొన్నారు.
ఆన్‌లైన్ అమ్మకాలను వ్యతిరేకిస్తూ..
ఆన్‌లైన్‌లో విచ్చలవిడిగా జరుగుతున్న మెడిసిన్ విక్రయాలకు నిరసనగా ఈ నెల 20న ఒక్కరోజు బంద్ తలపెట్టినట్లు ది హైదరాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో అసోసియేషన్ అధ్యక్షుడు ఆరుగొండ శ్రీధర్ గుప్త, గౌరవ అధ్యక్షుడు వెంకటరమణ రెడ్డిలు మాట్లాడుతూ అలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు 12 లక్షలకుపైగా మెడికల్ షాపు నిర్వాహకులు ఈ బంద్‌లో పాల్గొననున్నట్లు తెలిపారు.
బంద్ రోజు ఎమర్జెన్సీ మెడిసిన్ అవసరం ఉన్నవాళ్లు ఫోన్: 7569359595, 9281094907 నెంబర్‌లకు సంప్రదిస్తే వారికి మెడిసిన్ అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రకారాగం సంతోష్ కుమార్, కోశాధికారి ఎం.డీ.ఖాజా నజీమొద్దీన్, ప్రతినిధులు హనుమంత్‌రావు, రమేష్, కృష్ణమూర్తి, ప్రసాద్, కిషోర్, శివ, రవికాంత్, సాయి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.






