బడా బాబులపై బల్దియా గురి
- ఆస్తిపన్ను ఎగవేతదారులకు రెడ్ నోటీసులు
- ఏప్రిల్ 1 నుంచి ఆస్తుల సీజ్
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 5 (విజయక్రాంతి): ఆస్తి పన్ను వసూళ్లపై అధికా రులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025 ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే రూ.2 వేల కోట్లకు పైగా పన్నులు వసూలయ్యాయి. లక్ష్యానికి ఇంకా రూ.వెయ్యి కోట్ల మేర లోటు ఉండటంతో ఈ నెలాఖరులోగా ఆ మొత్తా న్ని రాబట్టేందుకు అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఏళ్ల తరబడి కోట్లాది రూపాయలు ఎగవేస్తున్న బడా సంస్థలు, వాణిజ్య సముదాయాలు,
రియల్ ఎస్టేట్ వ్యాపారుల భరతం పట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా హై-వాల్యూ కమర్షియల్ డిఫాల్టర్ల జాబితాను సిద్ధం చేసి ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధం చేశారు. నగరంలో కేవలం కమర్షియల్ ఆస్తుల నుంచే బల్దియాకు సుమారు రూ. 900 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ వంటి అత్యంత ఖరీదైన ప్రాంతాల్లోని ప్రముఖ కమర్షియల్ ప్రాపర్టీల యజమానులే ఈ ఎగవేతదారుల జాబితాలో టాప్లో ఉండటం గమనార్హం.
ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఈ మొండి బకాయిలను రాబట్టేం దుకు అధికారులు ఇప్పుడు మరింత కఠినంగా వ్యవహ రించాలని నిర్ణయించారు. ఇందులో భాగం గా లీగల్ యాక్షన్కు దిగే ముందు ఫైనల్ వార్నింగ్‌గా ఈ హైవాల్యూ డిఫాల్టర్లందరికీ ప్రత్యేకంగా రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నోటీసులు అందుకున్న తర్వాత కూడా స్పందించి పన్ను చెల్లించని వారిపై..
జీహెచ్‌ఎంసీ యాక్ట్ లోని సెక్షన్ 269 కింద డిస్ట్రెస్ వారంట్లు జారీ చేసి, వారి ప్రాపర్టీలు, షాపులను సీజ్ చేయడంతో పాటు, మూవబుల్ ఆస్తులైన వాహనాలను సైతం నిర్దాక్షిణ్యంగా జప్తు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ ఆస్తుల సీజింగ్‌కు సంబంధించి ఇప్పటికే సర్కిల్ స్థాయిలో డిప్యూటీ కమిషనర్, ట్యాక్స్ ఇన్స్పెక్టర్, బిల్ కలెక్టర్లతో ప్రత్యేక కమిటీలను సైతం ఏర్పాటు చేసినట్లు సమా చారం.
ఓటీఎస్ స్కీమ్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. కాబట్టి టాప్ డిఫాల్ట ర్లు తక్షణమే ఆన్లైన్ ద్వారా లేదా సంబంధిత అధికారులను సంప్రదించి బకాయిలు క్లియర్ చేసుకోవాలని బల్దియా వర్గాలు సూచిస్తున్నాయి. లేనిపక్షంలో ఏప్రిల్ 1 నుంచి కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.




