19 May, 2026 | 8:27 PM

జైనూర్‌లో రైతులకు సేంద్రియ సాగుపై అవగాహన సదస్సు

19-05-2026 07:03 PM

జైనూర్,(విజయక్రాంతి): పంట మార్పిడి విధానం పాటిస్తే రైతులకు అధిక దిగుబడులు వస్తాయని తెలంగాణ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ గౌరీ శంకర్, శివ లక్ష్మి సూచించారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా మంగళవారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం దుబ్బగూడ గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

సర్పంచ్ మడావి కౌసల్య భీమ్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పంట మార్పిడి వల్ల భూసారం పెరుగుతుందని శాస్త్రవేత్తలు వివరించారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలని రైతులకు వారు సూచించారు. రసాయనాలు ఎక్కువగా వాడితే భూమి దెబ్బతింటుందని, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందాలంటే సేంద్రియ పద్ధతులే మేలని తెలిపారు.

సేంద్రియ పద్ధతిలో పండిన ధాన్యం, కూరగాయలు ఆరోగ్యానికి మంచివని చెప్పారు. మార్కెట్‌లో డిమాండ్, మంచి ధర ఉన్న పంటలను ఎంచుకుని సాగు చేయాలని రైతులకు దిశానిర్దేశం చేశారు. సేంద్రియ సాగును ప్రోత్సహించి సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి టి.వినోద, సర్పంచ్ మడావి కౌసల్య భీమ్రావు, గ్రామ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.