5 June, 2026 | 7:31 PM

నేల ఆరోగ్యమే రైతు భవిష్యత్తు

05-06-2026 06:25 PM

– ఖేత్ బచావో అభియాన్‌పై అవగాహన

చివ్వెంల,(విజయక్రాంతి): చివ్వెంల మండలంలోని వాల్య తండ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “నేల సంరక్షణ యాత్ర – నేల ఆరోగ్యం, బలమైన రైతులు, సుసంపన్నమైన భారతదేశం” అనే అంశంపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) గడ్డిపల్లి శాస్త్రవేత్త డి. నరేష్ రైతులకు “ఖేత్ బచావో అభియాన్” (నేలలను రక్షించుకుందాం) కార్యక్రమంపై అవగాహన కల్పించారు.

శాస్త్రవేత్త డి. నరేష్ మాట్లాడుతూ భూసారాన్ని కాపాడేందుకు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సహజ, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు. అధిక రసాయన ఎరువుల వినియోగం వల్ల భూమి సారవంతత తగ్గిపోతోందని, భూసార పరీక్షలు నిర్వహించి అవసరమైన పోషకాలు, ఎరువులు మాత్రమే వినియోగించాలని రైతులకు వివరించారు. దీంతో సాగు ఖర్చులు తగ్గడంతో పాటు దిగుబడులు మెరుగుపడతాయని తెలిపారు.

అలాగే భూసార పరీక్షల కోసం మట్టి నమూనాల సేకరణ విధానంపై రైతులకు ప్రాయోగికంగా అవగాహన కల్పించారు. వాతావరణ మార్పులను తట్టుకునే సుస్థిర, పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులపై కూడా శిక్షణ ఇచ్చారు. మండల వ్యవసాయ అధికారి డి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రానున్న వానాకాలంలో రైతులు నీటి వనరుల లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల సాగు చేపట్టాలని సూచించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.