అధికారగణం.. అభాసుపాలు..
-భూబాధితులపై తీరుకు పరాకాష్ట
-నిమ్జ్ బాధితులు ఒకచోట..
-గ్రామసభ ఇంకోచోట..
-బయటపడ్డ అధికారుల నిర్లక్ష్యం
జహీరాబాద్, అక్టోబరు 16 : అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరుకుంటుంది..వారి వ్యవహార తీరు చూస్తుంటే బాధిత రైతుల పట్ల వారికున్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోంది. జాతీయ ఉత్పత్తుల పెట్టుబడుల సంస్థ (నిమ్జ్) భూ బాధితులకు నష్టపరిహారం విషయంలో అధికారుల తీరు విస్మయానికి గురి చేస్తోంది. భూ బాధితులు ఎవరో..ఏ గ్రామానికి చెందిన వారో కూడా తెలియకుండా గ్రామ సభ నిర్వహించి నవ్వులపాలయ్యారు. తీరా తప్పులో కాలేశామని తెలుసుకొని అసలు గ్రామంలో గ్రామ సభను శుక్రవారం నిర్వహించేందుకు సిద్దమయ్యారు.
జహీరాబాద్ ప్రాంతంలో నెలకొల్పబడుతున్న నిమ్జ్ భూ బాధితులు ఒకచోట ఉంటే గ్రామ సభను మరొకచోట ఏర్పాటు చేశారు. జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలంలోని భూములు కోల్పోయిన రైతులతో మాట్లాడేందుకు డిప్యూటీ కలెక్టర్ (నిమ్జ్) విశాలాక్షి వచ్చారు. గ్రామ సభకు ఝరాసంగం మండల తహసిల్దార్ తిరుమల రావు తమ సిబ్బందితో మండల పరిధిలోని చీలపల్లి గ్రామానికి చేరుకున్నారు. మండల సిబ్బంది వచ్చిన కొద్దిసేపటి తర్వాత డిప్యూటీ కలెక్టర్ విశాలాక్షి చిలక పల్లి గ్రామం వచ్చారు.
గ్రామంలోని రైతులందరూ గ్రామసభ వద్ద తహసిల్దార్ తిరుమలరావు భూ బాధితుల వివరాలను చదివారు. దీంతో గ్రామ ప్రజలందరూ మీరు చదివిన పేర్లలోని ఒక్కరు కూడా మా గ్రామంలో లేరని తెలిపారు. మీరు చదివిన పేరులోని వారందరూ కూడా చీలపల్లి తాండలో ఉంటారని తెలిపారు. సమావేశం నిర్వహించినట్లు సంతకాలు చేయాల్సిందిగా గ్రామ ప్రజలను కోరగా మా గ్రామానికి సంబంధించిన పేర్లు లేనందున మేము సంతకాలు చేయమని చీలపల్లి గ్రామ రైతులు తెలిపారు. దీంతో ఏం చేసేది లేక అధికారులందరూ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించుకొని వెళ్లిపోయారు. శుక్రవారం చీలపల్లి తాండలో సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా డి ప్యూటీ కలెక్టర్ తహసిల్దార్ ను ఆదేశించారు.
నేడు చీలపల్లి తాండలో గ్రామసభ..
గురువారం నాడు చీలపల్లి గ్రామంలో లబ్ధిదారు లేకపోవడంతో శుక్రవారం నాడు గ్రామసభను ఏర్పాటు చేయనున్నారు. గ్రామ సభలో భూములు కోల్పోయి నష్టపరిహారం అందని వారికి వివిధ కారణాల వల్ల నష్టపరహారం అందకపోవడంతో బాధితులతో మాట్లాడేందుకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి భూ బాధితులు హాజరుకావాలని మండల తహసిల్దార్ తిరుమలరావుకోరారు.




