07-02-2026 12:43:25 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ర్టంలో మున్సిపల్ ఎన్నికలు నిరంకుశంగా జరుగుతున్నాయని ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రావణ్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు అత్యంత దుర్మార్గంగా, హేయమైన రీతిలో జరుగుతున్నాయని మండిపడ్డారు. పాలకపక్షం విచ్చల విడిగా డబ్బులు పంచుతుంటే ఎన్నికల సంఘం చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని, పోలీసులు ప్రేక్షకుల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్య క్తం చేశారు.
శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో దాసోజు శ్రవణ్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అందుకే అధికార పార్టీ నాయకులు బీఆర్‌ఎస్‌పై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. మేడ్చల్ జిల్లా అలియాబాద్‌లో మా జీ మంత్రి మల్లారెడ్డిపై దాడిచేశారని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించడం ఎందుకు.. అంతటా అధికార పక్షం కాంగ్రెస్ గెలిచిందని సెర్టిఫికెట్లు ఇస్తే సరిపోతుం దని ఎద్దేవా చేశారు. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు పైన రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, ఆయనపై ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బుట్టంగారి మాధవ రెడ్డికి టికెట్ అంశం పార్టీ దృష్టికి తీసుకెళ్లామని, అధిష్ఠానం దీనిపైన సహేతుకమైన నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.