8 April, 2026 | 6:16 PM

మర్లపాడు గ్రామానికి చెందిన దివ్యాంగ మహిళపై దౌర్జన్యం

08-04-2026 04:31 PM

– రూ.4 లక్షల ఆస్తి ధ్వంసం, న్యాయం కోరుతూ విజయలక్ష్మి

వేంసూరు,(విజయక్రాంతి): మర్లపాడు గ్రామానికి చెందిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన దివ్యాంగ మహిళ తుంగా విజయలక్ష్మి తన కుటుంబాన్ని పోషించుకునేందుకు గత 7 సంవత్సరాలుగా ఫ్రూట్స్, జ్యూస్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. విజయలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం... ఆమె మహంకాళి జగన్నాధంకు చెందిన స్థలాన్ని నెలకు రూ.7,000 అద్దెకు తీసుకుని, రూ.60,000 అడ్వాన్స్ చెల్లించి వ్యాపారం ప్రారంభించారు. ఇద్దరు పిల్లలతో జీవిస్తున్న ఆమె కుటుంబం ఈ దుకాణంపైనే ఆధారపడి ఉందని చెప్పారు.

ఇటీవల స్థల యజమాని మహంకాళి జగన్నాధం అద్దెను ఒక్కసారిగా రూ.18,000కు పెంచాలని ఒత్తిడి తెచ్చారని, అలా చేయకపోతే ఇతరులకు షాప్ ఇవ్వాలని హెచ్చరించినట్లు ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో, జగన్నాధం అల్లుడు కొరిపల్లి నాగసుబ్బారావు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా దుకాణంలోకి వచ్చి, ఫ్రూట్స్, మిక్సీ జార్లు రోడ్డుపై పారవేయడం, ఫ్రిజ్, విద్యుత్ మీటర్ ధ్వంసం చేయడం, కౌంటర్‌లో ఉన్న రూ.25,000 నగదు తీసుకెళ్లడం వంటి చర్యలకు పాల్పడ్డారని తెలిపారు.

ఈ ఘటనపై వేంసూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసుల నుంచి స్పందన రాలేదని, ఇది “సివిల్ మ్యాటర్” అని చెప్పి నిర్లక్ష్యం చేసినట్లు ఆరోపించారు. అదేవిధంగా, సమస్య పరిష్కారం కోసం భీమ్ రెడ్డి చెన్నకేశవరెడ్డి ను సంప్రదించగా, పోలీసులకు ఇవ్వాల్సిన పేరుతో రూ.1 లక్ష తీసుకున్నారని, అయితే సమస్యను పరిష్కరించలేదని బాధితురాలు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఏప్రిల్ 5 అర్ధరాత్రి మరోసారి దుకాణంపై దాడి చేసి, సుమారు రూ.50,000 విలువైన వస్తువులు ధ్వంసం చేయడంతో పాటు మొత్తం నష్టం సుమారు రూ.4 లక్షలకు చేరిందని ఆమె తెలిపారు.

పోలీసులు కేసు నమోదు చేయకుండా, ఈ వ్యవహారంలో రాజకీయ పెద్దల ప్రమేయం ఉందని సూచిస్తూ వెనక్కి తగ్గాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. అంతేకాకుండా, ఫిర్యాదు చేస్తే తప్పుడు కేసులు నమోదు చేస్తామని బెదిరించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో, తాను న్యాయం కోసం మీడియాను ఆశ్రయించినట్లు, జిల్లా కలెక్టర్ ఖమ్మం, ఎస్పీ ఖమ్మం మరియు ఇతర ఉన్నతాధికారులు తక్షణం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, ఈ విషయంపై ఎస్సీ/ఎస్టీ కమిషన్, హైదరాబాద్‌కు కూడా ఫిర్యాదు పంపినట్లు తెలిపారు.