11 June, 2026 | 5:18 AM

దివ్యాంగుడిపై దాడి అమానుషం

11-06-2026 02:24 AM

దోషులను కఠినంగా శిక్షించాలి మల్‌రెడ్డి రాంరెడ్డి

జైపూర్ కాలనీలో గాయపడిన భాస్కర్ రెడ్డిని పరామర్శించిన

ముత్తినేని వీరయ్య, మల్‌రెడ్డి రాంరెడ్డి

నాగోల్, జూన్ 10 (విజయక్రాంతి): నాగోల్ డివిజన్ పరిధిలోని జైపూర్ కాలనీలో దాడికి గురై గాయపడిన వికలాంగుడు భాస్కర్ రెడ్డిని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి ఆయన నివాసంలో పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా మల్రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ, వికలాంగుడైన వ్యక్తిపై రాజకీయ కక్షతో దాడి చేయడం అత్యంత దురదృష్టకరమని, ఇది మానవత్వాన్ని అవమానించే చర్య అని పేర్కొన్నారు. శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యక్తిపై దాడి చేయడం సమాజానికి మంచిది కాదని అన్నారు. ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ, వికలాంగుల హక్కులు, గౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

బాధితుడికి పూర్తి న్యాయం జరిగే వరకు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. భాస్కర్ రెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో నాగోల్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షురాలు ఎర్రవెల్లి మంజుల రెడ్డి, చైతన్యపురి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండ సురేందర్ రెడ్డి, గడ్డిఅన్నారం ఏఎంసీ డైరెక్టర్ పన్యాల జైపాల్ రెడ్డి, నాయకులు చంద్రారెడ్డి, గాంధీ నాయక్, రోజా రెడ్డి, అరుణ, ఖాజా, వికలాంగుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.