8 May, 2026 | 1:24 AM

సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి

08-05-2026 12:21 AM

భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) మే 7 (విజయక్రాంతి): సరస్వతి అం త్యపుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేసి, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యార్ అధికారులను ఆదేశించారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద జరుగుతున్న అంత్య పుష్కరాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా సరస్వతి ఘాట్ను సందర్శించి, ఘాట్లో వేస్తున్న పార్కింగ్ టైల్స్ పనులు, సరస్వతి విగ్రహం వద్ద ఏర్పాటు చేసే పగోడాలు, చలువ పందిళ్ల ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఘాట్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న పార్కింగ్ స్థలాలు, శాశ్వత ప్రాతిపదికన నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులు, మద్దులపల్లి, పూసుకుపల్లి, బలిజాపూర్ మరియు గోదావరి వంతెన వద్ద ఏర్పాటు చేస్తున్న పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు.

అనంతరం మ్యూజియం పనులను  పరిశీలించి, ఈ నెల 18వ తేదీ నాటికి విగ్రహాల ప్రతిష్టాపన వాస్తు ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. ఈఓ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈనెల 21 నుండి జూన్ 1 వరకు నిర్వహించే సరస్వతి అంత్య పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని, గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు ముం దుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.

ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులకు వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేస్తూ, సుమారు 260 ఎకరాలలో 24 ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సరస్వతి ఘాట్ వద్ద పెద్దఎత్తున తాత్కాలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, పగోడాలు, స్టాల్స్, ప్లేజోన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

జిల్లా చిన్న పరిశ్రమల ఉత్పత్తులను ప్రోత్సహించేలా సుమారు 50 షాపులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పా రు. పిండప్రదాన కార్యక్రమాల కోసం గోదావరి తీరం వద్ద ప్రత్యేక చలువ పందిళ్లు ఏర్పా టు చేసి, అక్కడే పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 5:43 గంటలకు కంచి స్వామివారు త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించనున్నారని, అదేరోజు రాష్ట్ర గవర్నర్ కూడా పుణ్యస్నానం ఆచరించనున్నారని తెలిపారు.

గతంలో ఆది పుష్కరాల్లో స్నానం చేయని భక్తులు అంత్య పుష్కరాలకు పెద్దఎత్తున తరలివస్తారన్నారు.. అనంతరం కాళే శ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఆలయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూ లైన్ల నిర్వహణపై దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ధార్మిక సలహా దా రు  గోవింద హరి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డీఎఫ్వో నవీన్ రెడ్డి, ఈఓ మహేష్, అధికారులు పాల్గొన్నారు.