పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు పూర్తి..!
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి):జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో(Police Parade Ground) ఆగస్టు 15న నిర్వహించనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను(Independence Day) ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటీల్‌తో కలిసి పరేడ్ మైదానాన్ని పరిశీలించిన కలెక్టర్.. ప్రధాన వేదిక, జాతీయ పతాకావిష్కరణ, పోలీస్ పరేడ్, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల స్టాళ్ల ఏర్పాట్లను పరిశీలించారు. వేడుకలకు వచ్చే ప్రజలు, విద్యార్థులు, ప్రముఖులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, సీటింగ్, పార్కింగ్ వంటి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు.
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎలాంటి లోటుపాట్లకు తావివ్వొద్దని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎస్పీ భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్‌పై ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ బి.చెన్నయ్య, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ అర్చన, సంబంధిత అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






