07-02-2026 07:40:14 PM
నిర్మల్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై సంబంధిత నోడల్ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశ కీలకమని పేర్కొన్న కలెక్టర్, ఎన్నికలు నిష్పక్షపాతంగా, ఎటువంటి అంతరాయాలు లేకుండా జరిగేలా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు.
పోలింగ్, కౌంటింగ్ సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇవ్వాలని, కౌంటింగ్ సిబ్బంది రాండమైజేషన్‌ను ఎన్నికల నిబంధనల ప్రకారం ఖచ్చితంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియలో ఎటువంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్యాలెట్ బాక్సుల రవాణా, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, ఎన్నికల సామగ్రి సరఫరా వంటి అంశాల్లో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని తెలిపారు.
పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉండాలని, సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ, వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లను ముందుగానే తనిఖీ చేసి సిద్ధం చేయాలని ఆదేశించారు. సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు పైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నాకళ్యాణి, వివిధ శాఖల నోడల్ అధికారులు భోజన్న, శ్రీనివాస్, శంకర్, రమణ, విష్ణువర్ధన్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సర్పరాజ్, ఈ డి ఎం నదీమ్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.