మూడు దశాబ్దాల తర్వాత పూర్వ విద్యార్థుల కలయిక
30-04-2026 05:54 PM
ఇల్లందు, (విజయక్రాంతి): ఇల్లందు సింగరేణి ఉన్నత పాఠశాల 1994-95 బ్యాచ్ పూర్వ విద్యార్థులు బుధవారం తమ పాఠశాల ప్రాంగణంలో మూడు దశాబ్దాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సుదీర్ఘ విరామం తర్వాత ఒకే వేదికపైకి వచ్చిన మిత్రులంతా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు నాగిరెడ్డి, సుధాకర్‌లను ఘనంగా సన్మానించి ఆశీస్సులు పొందారు. 30 ఏళ్ల క్రితం నాటి తరగతి గది ముచ్చట్లు, ఆటపాటలను గుర్తు చేసుకుంటూ పూర్వ విద్యార్థులు సందడి చేశారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఒక్కచోట చేరి తమ వృత్తి, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకున్నారు. మారుతున్న కాలంలో బంధాలు తగ్గుతున్న వేళ ఇలాంటి ఆత్మీయ కలయికలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి.






