18 August, 2026 | 8:34 PM

చదువుతోనే ఉన్నత శిఖరాలు చేరాలి

18-08-2026 07:06 PM

క్రమశిక్షణ తప్పనిసరి: సర్పంచ్ సామ్రాజ్యం  

దాతలుగా మారిన 2003-04 బ్యాచ్ పూర్వ విద్యార్థులు

చర్ల,(విజయక్రాంతి): విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని, అందుకు క్రమశిక్షణయే మార్గమని చర్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పూజారి సామ్రాజ్యం అన్నారు. సర్పంచ్ భర్త, యువజన కాంగ్రెస్ నాయకుడు వల్లి శ్రీకాంత్ జన్మదినోత్సవం సందర్భంగా చర్లలోని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్థి నిలయాన్ని 2003-2004 విద్యా సంవత్సరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదవ తరగతి పూర్వ విద్యార్థులు సందర్శించారు.

ఈ సందర్భంగా నిలయంలోని విద్యార్థులకు 50 కిలోల బియ్యం, 20 స్టీల్ ప్లేట్లు, పండ్లు, స్వీట్లు అందజేశారు. నిలయ కమిటీ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ సామ్రాజ్యం మాట్లాడుతూ ఇతర వ్యాపకాలపై దృష్టి పెట్టకుండా చదువుపైనే శ్రద్ధ వహించాలని విద్యార్థులకు సూచించారు. చదివి ఉద్యోగం సాధించిన వారిని ఆదర్శంగా తీసుకొని జీవితాన్ని సుస్థిరం చేసుకోవాలన్నారు.

క్రమశిక్షణతో మెలిగితే చదువుతోపాటు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవచ్చని పేర్కొన్నారు. గిరిజన విద్యార్థుల అభ్యున్నతి కోసం వనవాసీ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. వనవాసీ జిల్లా కార్యదర్శి కోరం సూర్యనారాయణ మాట్లాడుతూ సంస్థకు ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఆదాయం లేదని, కేవలం దాతల సహకారంతోనే నడుస్తోందన్నారు. దాతల నమ్మకాన్ని నిలబెట్టేలా విద్యార్థులు కృషి చేయాలని కోరారు.