25 August, 2026 | 5:46 PM

వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలి

25-08-2026 04:41 PM

హాజీపూర్,(విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావంతో జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని, రైతులు వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ఆత్మ చైర్మన్ సింగతి మురళి అన్నారు. మంగళ వారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడి రైతు వేదికలో ఆత్మ (ATMA – Agriculture Technology Management Agency) ఆధ్వర్యంలో నిర్వహించిన పంటల వ్యవస్థలపై శిక్షణ కార్యక్రమంలో మంచిర్యాల ADA మామిడి క్రిష్ణతో కలిసి మాట్లాడారు. రైతులు వరి పంటపై అధికంగా ఆధారపడకుండా, మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు.

ముఖ్యంగా ఆయిల్‌పామ్, పందిరి కూరగాయలు, పప్పు దినుసులు, ఆరుతడి పంటలు, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఇతర పంటలను సాగు చేయడం ద్వారా రైతులు మెరుగైన ఆదాయం పొందవచ్చని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, నీటి వినియోగాన్ని తగ్గించడం, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా రైతులు సాగులో మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. 

పందిరి కూరగాయల సాగుకు ఎకరానికి రూ. లక్ష వరకు సబ్సిడీ అందుబాటులో ఉన్నందున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఆయిల్‌పామ్ సాగుకు సంబంధించిన సబ్సిడీ, ఇతర వివరాల కోసం ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించాలన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు పద్ధతులను పాటిస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల AMC చైర్మన్ రామగిరి భనేష్, కర్ణమామిడి సర్పంచ్ బొడ్డు భూమన్న, పడ్తనపల్లి సర్పంచ్ దొండ ఎస్సయ్య, ఆత్మ డైరెక్టర్లు జగన్ రెడ్డి, రవి గౌడ్, FPO డైరెక్టర్లు బొడ్డు శంకర్, పుస్కూరి శ్రీనివాస రావు, ఉద్యానవన అధికారి సహజ, వ్యవసాయ అధికారి క్రిష్ణ, AEO కొమురయ్య, ఆయిల్ పామ్ మాట్రిక్స్ శ్రీకాంత్, కృషి, సఖి, రైతులు తదితరులు పాల్గొన్నారు.