22 July, 2026 | 5:46 PM

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

22-07-2026 04:42 PM

ఆరుతడి, స్వల్పకాలిక పంటలు వేయాలి

వాన నీటిని సంరక్షించాలి

నీటి వృథాను అరికట్టాలి

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

చందుర్తి,(విజయక్రాంతి): ఎల్ నినో పరిస్థితుల ప్రభావం తో ప్రత్యామ్నాయ పంటల సాగుపై చందుర్తి మండలం మల్యాలలో బుధవారం గ్రామసభ నిర్వహించగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కార్యక్రమనికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ... ఎల్ నినో ప్రభావం అందరిపై ఉంటుందని స్పష్టం చేస్తూ, ఎల్ నినో ప్రభావం, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలాలు తగ్గుతున్నాయని, చందుర్తి మండలంలో గత ఏడాది 328 మిల్లీమీటర్ల వర్షం నమోదు ఐతే ఈ ఏడాది 230 మిల్లిమీటర్ల వర్షం కురిసిందని అన్నారు. భూగర్భ జలాలు గత ఏడాది 4.38 మీటర్ల లోతులో ఈ ఏడాది 8.53 మీటర్ల లోపలికి వెళ్లాయని వెల్లడించారు. మిడ్ మానేరు, మల్కపేట, అన్నపూర్ణ రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, ఈ నీరు తాగునీటికె వినియోగిస్తామని, ఇండ్లలో నీటిని వృథా చేయవద్దని సూచించారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు స్వల్ప కాలిక పంటలు సాగు చేయాలని సూచించారు. ప్రస్తుతం ఒక టన్ను ఆయిల్ పామ్ కు రూ. 23 వేల ఆదాయం వస్తుందని వివరించారు. చందుర్తి మండలంలో 92 ఎకరాల్లో ఆయిల్ పామ్ వేశారని, మిగతా రైతులు ముందుకు రావాలని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు, బోర్ వెల్స్ రీచార్జ్ పనులు, అలాగే రైతుల పొలాల వద్ద పామ్ పాండ్స్, బోర్ వెల్ రీచార్జ్ పనులు  ముమ్మరంగా చేయాలని ఆదేశించారు. ప్రతి వర్షం నీటి బొట్టును ఒడిసి పట్టాలని పిలుపు నిచ్చారు.

కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెల్కల తిరుపతి, వేములవాడ ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా పంచాయతీ అధికారి జయశీల, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి దయాకర్, రైతు విజ్ఞాన కేంద్రం శాస్రవేత సాయి కుమార్, హౌసింగ్ డీఈ సాజిద్, తహసీల్దార్ భూపతి, ఎంపీడీఓ రాధ, సర్పంచ్ శారద తదితరులు పాల్గొన్నారు.