1 April, 2026 | 10:10 PM

గబ్బిలాల పేటలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు స్థలం కేటాయించండి

01-04-2026 08:14 PM

స్కూల్ నిర్మించేంతవరకు సిపిఐ పోరాటం ఆగదు

సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్

జవహర్ నగర్,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లోని గబ్బిలాల పేటలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్మాణం కొరకు వెంటనే స్థలం కేటాయించాలని  స్కూల్ నిర్మించేంతవరకు సిపిఐ పోరాటం ఆగదని సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ డిమాండ్ చేశారు. కాప్రా మండల పరిధిలోని జవహర్ నగర్ గబ్బిలాల పేటలో కిరాయి రూములో నడుస్తున్న ఎంపీపీ ఎస్ గబ్బిలాల పేట పాఠశాలను సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దామోదర్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు తోటపల్లి శంకర్ లతో కూడిన సిపిఐ బృందం బుధవారం సందర్శించారు.

ఈ సందర్భంగా పాఠశాల సమస్యలను స్థానిక ప్రజలను పాఠశాల సిబ్బందిని ఆరా తీయగా పాఠశాలలో మొత్తం 126 మంది విద్యార్థులు చదువుకుంటూ ఉండగా కేవలం మూడు గదులే ఉండడం వల్ల విద్యార్థులుకు సరైన విధంగా చెప్పే పరిస్థితి లేదని సుమారు 46 మంది విద్యార్థులకు ఆధార్ కార్డులు కూడా లేవని అందువల్ల వారి పేర్లు ఆన్లైన్లో నమోదు కాకపోవడం భవిష్యత్తులో విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి వెంటనే ఆధార్ కార్డు లేని వాళ్లకు జనన ధ్రువీకరణ పత్రాలను స్థానిక రెవెన్యూ అధికారులు అందజేస్తే ఆధార్ కార్డు వస్తుందని తెలిపారు.

ఈ పాఠశాలకు ప్రభుత్వం నాలుగు ఎకరాల స్థలాన్ని కేటాయించిందని ఆ స్థలంలో వెంటనే ప్రభుత్వ పాఠశాల నిర్మిస్తే బయటకు వెళ్లే విద్యార్థులు ఇక్కడే చదివే అవకాశం ఉన్నదని తెలిపారు. ఐదవ తరగతి పూర్తి చేసి దూరంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు పోలేని విద్యార్థులు డ్రాప్ అవుట్ కాకుండా చదువుకునే పరిస్థితి ఉందని ఈ అంశాలను గత అసెంబ్లీ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటే సత్యం ప్రస్తావించారని అందువల్ల రెవెన్యూ యంత్రాంగం కదిలి ఈ పాఠశాల నిర్మాణం కోసం స్థలాన్ని వెంటనే కేటాయించాలని కోరారు. మూడు లక్షల జనాభాకు కేవలం రెండు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలే ఉండడం సిగ్గుచేటని ప్రభుత్వ విధానాల వల్ల వేలాది మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ను అమలు చేసి జవహర్ నగర్ గబ్బిలాల పేటకు మరో ఉన్నత పాఠశాల తీసుకువచ్చి పిల్లలందరూ చదువుకునే విధంగా ప్రయత్నాలు చేయాలని పి లుపునిచ్చారు. లేకుంటే రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాల నిర్మాణం కోసం రాష్ట్రంలోని మేధావి వర్గాలను కలుపుకుని, రాజకీయ పక్షాలను విద్యార్థి సంఘాలను ఐక్యం చేసి పాఠశాల నిర్మాణం అయ్యేంతవరకు పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అన్వర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నరసింహులు, మండల సహాయ కార్యదర్శి రాజేశ్వరి, గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి స్వరూప, సత్యం, లత, నాని, లక్ష్మణ్, వెంకటయ్య, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.