ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డుపై ప్రమాదం
తవేరా కారు బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి
శేరిలింగంపల్లి, ఆగస్టు 8 (విజయక్రాంతి): గచ్చిబౌలి సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న తవేరా కారు అదుపు తప్పి బ్రిడ్జి పిల్లర్‌ను బలంగా ఢీకొనడంతో కారులోని ఇద్దరు యువకులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.మృతులు రాజస్థాన్‌కు చెందిన కనైయాల్ (25), దేరామ్ (24). వీరిద్దరూ కొల్లూరు ఇంద్రారెడ్డినగర్‌లో నివసిస్తూ టైల్స్ పనులు చేసుకుంటున్నారు.
శనివారం అర్ధరాత్రి సుమారు 12.25 గంటల సమయంలో ఇంద్రారెడ్డినగర్ నుంచి నానక్‌రామ్‌గూడ వైపు AP 01 AB 2232 నంబరు గల తవేరా కారులో బయలుదేరారు. కారును కనైయాల్ నడుపుతుండగా డంపింగ్‌యార్డు, నియోపోలిస్ పోలీస్ బ్రిడ్జి సమీపంలోని సర్వీస్ రోడ్డుపై అతివేగంతో వెళ్తూ అదుపు కోల్పోయారు. కారు నేరుగా బ్రిడ్జి పిల్లర్‌పైకి దూసుకెళ్లి ముందు భాగం పూర్తిగా ముక్కలైంది. ఘటన తీవ్రతకు ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు తేలడంతో స్వయం ప్రమాదంగా పరిగణించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






