మునుగోడులో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
– అభయాంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ
మునుగోడు,(విజయక్రాంతి): మునుగోడు పట్టణంలో ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని 15 అడుగుల ఎత్తైన అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం హనుమాన్ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో తన సతీమణి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మితో కలిసి పాల్గొని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని దంపతులు ప్రారంభించారు.
తరువాత మునుగోడు పట్టణంలోని పురాతన శివరామ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయం, కొంపల్లి శివారు తూర్పు గూడెం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, చీకటి మామిడి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాల్లో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు,భక్తులు ఉన్నారు.




