07-02-2026 12:04:30 AM
ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయ్ కుమార్
కామారెడ్డి, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): చదువుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడే విద్యార్థుల్లో ఉన్నతమైన వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుందని కామారెడ్డి ప్రభుత్వ ఆరట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ అన్నారు.
కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-1 ఆధ్వర్యంలో వేల్పుగొండ గ్రామంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న శీతాకాల ప్రత్యేక శిబిరం శుక్రవారం ముగిసింది. ఈ ముగింపు వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రిన్సిపల్ వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. సామాజిక స్పృహ కలిగిన విద్యార్థులు దేశానికి ఆస్తి అని కొనియాడారు. అనంతరం కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె. కిష్టయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు తమ జీవితంలో క్రమశిక్షణ, ఏకాగ్రత, లక్ష్యంపై స్పష్టతను కలిగి ఉండాలని, ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని సూచించారు.
ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాజ్ గంభీరావు గత ఏడు రోజులుగా గ్రామంలో చేపట్టిన శ్రమదానం, ఆరోగ్య అవగాహన సదస్సులు, సర్వేలు, ఇతర సేవా కార్యక్రమాల నివేదికను చదివి వినిపించారు.శిబిరంలో చురుగ్గా పాల్గొన్న వాలంటీర్లకు అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ జి. శ్రీనివాసరావు, డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, కె. శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ శోభా సాగర్, తిరుమలరావు, వార్డు సభ్యులు ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.