5 June, 2026 | 2:34 AM

ఆరోగ్యశ్రీ బకాయిలు బండెడు!

05-06-2026 01:18 AM

రెండేళ్లుగా రూ. 2,500 కోట్లు పెండింగ్

కొత్తగా ఈహెచ్‌ఎస్ స్కీం మరో భారం అంటున్న నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు

చికిత్స రేట్లు కూడా పెంచాలని డిమాండ్

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): అటు ప్రజలు.. ఇటు ఉద్యోగులు, పెన్షనర్ల ప్రాణాలకు రక్షణగా నిలిచే ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్ స్కీంను ప్రభు త్వం నిర్లక్ష్యం చేస్తున్నది. ఆరోగ్యశ్రీ, ఈ హెచ్‌ఎస్ బకాయిలు భారీగా పేరుకుపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రులు వైద్యంచేయ డానికి ముందుకురావడంలేదు. నిజానికి ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్ కార్డులంటేనే ఆస్పత్రులు జంకుతున్నాయి. దీంతో సామాన్యలు, ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

కొన్ని ఆస్పత్రులు ఈహెచ్‌ఎస్, ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలుచేస్తున్నప్పటికినీ బకాయిలను ఎప్పటికప్పుడు చెల్లిస్తే తమకు భారం తప్పుతుందని ఆస్పత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్ కింద నెట్‌వర్క్, ఇతర ఆస్పత్రులకు ఇప్పటివరకు దాదాపు రూ. 2,500 కోట్లు బకాయిలు ఉన్నట్లుగా తెలిసింది. ఇవి గత రెండేళ్లకు చెల్లించాల్సినవ ని నెట్‌వర్క్ ఆస్పత్రులు పేర్కొంటున్నా యి. ఇందులో నెట్‌వర్క్ ఆస్పత్రులకే రూ. 1,500 కోట్ల వరకు రావాల్సిఉంది.

రేట్లు మార్చాల్సిందే..

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, హెల్త్ స్కీం అమలవుతున్న నెట్‌వర్క్, ఇతర ప్రైవేట్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కలిపి దాదాపు 460 వరకు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డు.. అన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో సరిగా పనిచేయడంలేదు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్ కార్డు కింద వైద్యం కోసం వెళ్తే వారిని కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు అడ్మిట్ చేసుకోవ డం లేదు. బకాయిలు సరిగా చెల్లించకపోవడమే కారణమైతే, ఆ బిల్లులు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి.

పాత రేట్లకు చికిత్స చేసేందుకు ఎలా ముందుకు రావాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్యశ్రీ రేట్లే తక్కువగా ఉన్నాయంటే, దీనికంటే ఇంకా తక్కువగా ఉన్న సీజీహెచ్‌ఎస్ రేట్లతో కార్పొరేట్ స్థాయి వైద్యం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. వైద్య రంగంలో పెరుగుతున్న సాంకేతికత, నిర్వహణ, చికిత్స, వైద్యులు, సిబ్బందికి ఇవ్వాల్సిన జీతాలు, ఇతరత్రా ఖర్చులకు ప్రభుత్వం చెప్పే రేట్లకు వైద్యం చేయడం సాధ్యంకాదని తేల్చిచెప్తున్నారు.

ఈక్రమంలోనే హెల్త్ కార్డులు కార్పొరేట్ ఆస్పత్రుల్లో సరిగా పనిచేయకపోవడంతో పకడ్బందీగా హెల్త్ స్కీం అమలుచే యాలని ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ప్రభుత్వం, ఉద్యోగుల భాగస్వామ్యంతో హెల్త్ ట్రస్ట్ ద్వారా నూతన హెల్త్ స్కీంను అమలుచేస్తోంది. 

బకాయిలు చెల్లించకపోతే ఎలా?

బకాయిలు చెల్లించకుండా వైద్యం చేయడం ఎలా సాధ్యం. మరోవైపు తమను ఏమాత్రం సంప్రదించకుండానే కొత్త హెల్త్ స్కీం ఎలా అమలు చేస్తారు. మాతో చర్చించాలి కదా. ఈ విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లాము. ఎక్కడో ఓ మారుమూల జిల్లాలోని ఆస్పత్రిలో అందే వైద్యానికి, అక్కడి ఖర్చులకు.. ఇక్కడ హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో అందే వైద్యం, నిర్వహణ భారం, ఖర్చులకు ఒకేరకమైన వైద్యం ఎలా అందుతుంది. పాత రేట్లకు వైద్యం అందించని పరిస్థితి ఉంది.

 ఓ వైద్యుడు, నెట్‌వర్క్ ఆస్పత్రి యజమాని. 

మళ్లీ కొత్త స్కీమా?

ప్రభుత్వం పాత బకాయిలను చెల్లించకుండా మరోభారం తమపై మోపేందుకు సిద్ధమవుతున్నదని ఆస్పత్రుల యాజమాన్యాలు ఆగ్ర హం వ్యక్తంచేస్తున్నాయి. ఏ మాత్రం తమతో చర్చించకుండానే ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభు త్వం ఈహెచ్‌ఎస్ స్కీంను ఎలా అమలుచేస్తారని ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు చికిత్సకు సంబంధించిన రేట్లు మార్చకుండా ఏకపక్షంగా ఎలా నిర్ణయిస్తారని మండిపడుతున్నారు. ఈ విషయాన్ని వైద్యారోగ్య శాఖ అధికారుల దృష్టికి నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు నెల క్రితమే తీసుకుపోయినప్పటికీ స్పష్టమైన హామీ రాలేదని చెప్తున్నారు.