12 August, 2026 | 3:10 PM

బీఆర్ఎస్ వైఖరి రాష్ట్రానికి నష్టం.. కేటీఆర్‌పై శ్రీధర్ బాబు విమర్శలు

12-08-2026 02:07 PM

నదీజలాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు

గాంధీ భవన్‌లో ప్రజలతో శ్రీధర్ బాబు ముఖాముఖి

హైదరాబాద్: భూ కేటాయింపులో(Land Allocations) 200 కోట్ల కుంభకోణం, తెలంగాణకు సంబంధించిన ఇతర అంశాలపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) బుధవారం నాడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (BRS Working President KT Rama Rao)పై తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ భవన్‌లో జరిగిన ముఖాముఖి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫామ్‌హౌస్‌లో పండించిన వడ్లకు ఎంత ధర వచ్చిందో తెలంగాణ రైతులకు వివరించాలని శ్రీధర్ బాబు కేటీఆర్ కు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతల వైఖరి రాష్ట్రానికి నష్టం చేస్తోందని శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధికి ప్రతిపక్షం సహకరించాలని మంత్రి కోరారు. బీఆర్ఎస్ హయంలో నెలకొల్పిన సంస్థలను తాము కూడా కొనసాగిస్తున్నామని శ్రీధర్ బాబు సూచించారు.

గాంధీభవన్ వ్యవహారాలకు పార్టీ వాళ్లందరూ సహకరిస్తున్నారని తెలిపారు. పరిశ్రమలు, పెట్టుబడుల ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. భూమి విలువకు సంబంధించి అవాస్తవాలతో ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. పరిశ్రమలను ప్రోత్సహించటం కోసం రాయితీలు ఇవ్వడం సాధారణమే, పరిశ్రమలను ప్రోత్సహించటం కోసం భూములు ఇవ్వడమూ సహజమే అన్నారు. బోర్డు నిర్ణయం మేరకే పరిశ్రమలకు భూములు ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు. నదీజలాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి తేల్చిచెప్పారు. పారిశ్రామికవేత్తలను బీఆర్ఎస్ నేతలు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని శ్రీధర్ బాబు ఆరోపించారు.