2 August, 2026 | 11:19 AM

కోదాడలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనపై పోలీసుల ఉక్కుపాదం

02-08-2026 10:13 AM

ఒకేరోజు 50 వాహనాలు సీజ్ 

ట్రిపుల్ రైడింగ్, మైనర్ల డ్రైవింగ్, నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్

వాహనదారులు, తల్లిదండ్రులకు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి కౌన్సిలింగ్

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో టౌన్, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో శనివారం ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు.ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఒకే బైక్‌పై ముగ్గురు ప్రయాణించడం (ట్రిపుల్ రైడింగ్), మైనర్లు వాహనాలు నడపడం, నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలపై దృష్టి సారించిన పోలీసులు మొత్తం 50 వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అనంతరం పోలీస్ స్టేషన్‌లో వాహనదారులు, మైనర్ల తల్లిదండ్రులకు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, టౌన్ ఇన్‌స్పెక్టర్ శివశంకర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, మైనర్లకు వాహనాలు అప్పగిస్తే తల్లిదండ్రులపైనా చట్టపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై నిరంతర నిఘా కొనసాగుతుందని, ట్రిపుల్ రైడింగ్‌తో ప్రాణాలను ప్రమాదంలో పడేయొద్దని సూచించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని డీఎస్పీ స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో టౌన్, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.