8 June, 2026 | 1:40 AM

సామాన్యుడిపై భూం!

08-06-2026 12:00 AM
  1. భూముల విలువ పెంపుతో ప్రజలపై భారం
  2. పెరగనున్న రిజిస్ట్రేషన్ ఖర్చులు
  3. ఇప్పటికే నిర్మాణ రంగం, ఇతర ధరల పెరుగుదల 
  4. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మరింత భారం
  5. ఆదాయమే లక్ష్యంగా సర్కార్ ఎత్తుగడ!
  6. ఏటా రూ.1,400 కోట్ల అదనపు రాబడి

హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం పెంచిన భూముల మార్కెట్  విలువ.. సామాన్య, మధ్య తరగతిపై తీవ్ర ప్రభావం చూపనుంది. మార్కెట్  విలువలకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేందుకు రేట్లు సవరించినట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కొను గోలుదారులపై అదనపు భారం తప్పదన్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భూమి విలువ పెరిగినప్పుడు సహజంగానే రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా పెరుగుతాయని అంటున్నారు.

తెలంగాణ సర్కార్ భూముల మార్కెట్  విలువలను 25 శాతం నుంచి 100 శాతం పెంచగా.. జూన్ 5 నుంచి అమల్లోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాల వారీగా  25, 50, 75, 100 శాతం శ్లాబ్‌లలో పెంపును అమల్లోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా హైదరాబా ద్ పశ్చిమ ప్రాంతాలు, కోకాపేట్, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీలు, జాతీయ రహదారుల వెంట ఉన్న ప్రాంతాల్లో భారీగా పెంపు జరిగింది.

మార్కెట్‌లో వాస్తవ లావాదేవీలకు, ప్రభుత్వ మార్కెట్ విలువలకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేందుకే ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. అయి తే ప్రజల దృష్టిలో తమపై భారం మోపే నిర్ణయంగా కనిపిస్తోంది. ఇప్పటికే నిర్మాణ రంగం లో ధరల పెరుగుదల, బ్యాంకు రుణాలకు వడ్డీ భారం, ఆకాశాన్నంటుతున్న భూముల రేట్లతో ఇబ్బందులు పడుతున్న సామాన్య, మధ్య తరగతికి ప్రభుత్వం నిర్ణయం మరో సవాల్‌గా మారిందని ఆయా వర్గాల ప్రజలు వాపోతున్నారు. మరోవైపు సంక్షేమ పథకాల అమలు, ఆర్థిక ఒత్తిళ్ల మధ్య  ఆదాయ వనరులను పెంచుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు అంటున్నారు.

రియల్ ఎస్టేట్ రంగంపైనా ప్రభావం

భూముల మార్కెట్ విలువ పెంపు ప్రభా వం రియల్ ఎస్టేట్ రంగంపైనా పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు ప్రధాన పట్టణాల్లో భూముల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్  ఖర్చు లు కూడా పెరగడంతో కొంతమంది కొనుగోలుదారులు తమ నిర్ణయాలను వాయిదా వేసే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్  విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు భూములు విలువ పెరగడం ద్వారా ఆ ప్రాంతాలకు అధికారికంగా అధిక విలువ లభించినట్లవుతుందని, భవిష్యత్తులో పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. 

ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకేనా?

రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆరు గ్యారంటీలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు ప్రయాణం, విద్యా-వైద్య రంగాల ఖర్చులతో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో అదనపు ఆదాయ వనరుల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోది. ఈ క్రమంలోనే ప్రభుత్వం భూముల మార్కెట్  విలువ పెంచిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ శాఖ అంచనాల ప్రకారం ఈ నిర్ణయం వల్ల స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్  ఫీజుల రూపంలో ప్రభుత్వానికి  ఏటా సుమారు రూ.1,400 కోట్ల అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. 

ఫీజులో మార్పుండదు.. రిజిస్ట్రేషన్ ఖర్చే పెరగనుంది

స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు శాతాల్లో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే మార్కెట్  విలువలు పెరగడంతో వాటి ఆధారంగా లెక్కించే రిజిస్ట్రేషన్ మొత్తం పెరుగుతుంది. ఉదాహరణకు గతంలో రూ.20 లక్షలు విలువ చేసే  భూమి ధర ఇప్పుడు రూ.30 లక్షలకు పెరిగితే, దీని ప్రకారంగానే  రిజిస్ట్రేషన్  ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఆస్తి పన్ను పెరగకపోయినా ప్రజలు చెల్లించాల్సిన మొత్తం పెరిగే అవకాశం ఉంది.

దీంతో ఇండ్లు, ప్లాట్లు  కొనుగోలు చేయాలనుకునే మధ్యతరగతి కుటుంబాలపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది.  వ్యవసాయ భూముల మార్కెట్  విలువల పెంపు రైతులకు ఒకవైపు ప్రయోజనకరంగా కనిపిస్తున్నప్పటికీ మరోవైపు అదనపు ఖర్చులను కూడా తీసుకొస్తోంది. భూముల విలువలు పెరగడం వల్ల బ్యాంకుల నుంచి రుణాలు పొందే సమయంలో ఆస్తి విలువ ఎక్కువగా పరిగణనలోకి వచ్చే అవకాశం ఉంది.

భూ సేకరణల సమయంలో పరిహారం అంశంపైనా కొంత ప్రభావం ఉండొచ్చు. అయితే భూముల కొనుగోలు, అమ్మకాలు, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల బదిలీలు వంటి సందర్భాల్లో రైతులు కూడా అధిక రిజిస్ట్రేషన్ ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో చిన్న, సన్నకారు రైతులపై ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.