రైతులు పంట మార్పిడి, లాభదాయక పంటలపై దృష్టి సారించాలి
ఆయిల్ పామ్ సాగును విస్తరించాలి
ప్రజా ప్రభుత్వంలో రైతులకు భారీ సబ్సిడీలు
ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన రైతు వారోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పాల్గొన్నారు. అనంతరం ఆయిల్ ఫామ్ రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయరమణ రావు మాట్లాడుతూతన చిన్ననాటి రోజుల్లో ఎలిగేడు మండలంలో కాలువ నీరు అందుబాటులో లేకపోయేదని గుర్తుచేశారు.
అనంతరం జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ నాయకత్వంలో శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగి కాలువల ద్వారా రైతులకు నీరు అందించబడిందన్నారు. మొదటి దశలో అప్పటి కరీంనగర్ జిల్లాలో 5.4 లక్షల ఎకరాలకు నీరు అందించగా, అందులో 1.4 లక్షల ఎకరాలు పెద్దపల్లిలోనే ఉన్నాయని తెలిపారు. 2014 తర్వాత అప్పటి ప్రభుత్వం శ్రీరాంసాగర్ కాలువలను నిర్లక్ష్యం చేసి ఇతర ప్రాజెక్టులపై దృష్టి సారించడం వల్ల ఈ ప్రాంత రైతులకు నష్టం జరిగిందని విమర్శించారు.
గతంలో పెసర్లు, జొన్నలు, కందులు వంటి పంటలు పండించిన రైతులు ఇప్పుడు ఎక్కువగా వరి పంటపైనే ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. ఇది రైతులకు లాభదాయకం కాదని, పంట మార్పిడి చేపట్టి మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని సూచించారు.రైతులు ఆయిల్ పామ్ వంటి లాభదాయక పంటలను సాగు చేయాలని, భూమి సారాన్ని కాపాడేందుకు యూరియా వినియోగాన్ని తగ్గించాలని, పంట అవశేషాలను కాల్చడం మానుకోవాలని సూచించారు. మన నియోజకవర్గంలో కొంతమంది రైతులు ఎకరానికి రూ.1 లక్ష నుండి రూ.1.5 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారని తెలిపారు.
వచ్చే ఏడాది ఎలిగేడు మండలంలో కనీసం వెయ్యి ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్, తహసిల్దార్ యాకన్న, పలు గ్రామాల సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.






