20 May, 2026 | 3:44 AM

పుష్కరాలకు 3,360 ప్రత్యేక బస్సులు

20-05-2026 01:09 AM
  1. అదనంగా 50 శాతం చార్జీ వసూలు 
  2. మహిళలకు ‘మహాలక్ష్మి’ ద్వారా ఉచిత ప్రయాణం 

మహబూబాబాద్, మే 19 (విజయక్రాంతి): గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల సంగమ క్షేత్రం కాళేశ్వరంలో ఈనెల 21 నుండి జూన్ 1 వరకు నిర్వహించనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు రాష్ట్రవ్యాప్తంగా హాజరయ్యే భక్తుల కోసం 3,360 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు వరంగల్ రీజియన్ మేనేజర్ భవాని ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి 3,360 బస్సులను కాళేశ్వరం కు 5,772 ట్రిప్పులు నడపడానికి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వరంగల్ 1, వరంగల్ 2, పరకాల, నర్సంపేట, జనగామ, భూపాలపల్లి, తొర్రూరు, మహబూబాబాద్ డిపోల నుంచి 59 ప్రత్యేక బస్సులు నడుపుతామని, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన హనుమకొండ బస్టాండు నుండి ప్రత్యేకంగా బస్సులు నడిపిస్తామని చెప్పారు.

కాలేశ్వరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండులో ప్రయాణికులకు అన్ని వసతులు కల్పించినట్లు చెప్పారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో పుష్కరాలకు వెళ్లే భక్తుల నుండి అదనంగా 50 శాతం చార్జీ వసూలు చేస్తామని తెలిపారు. అలాగే మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా పూర్తిగా ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తామని చెప్పారు. భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా అంత్యపుష్కరాల్లో పాల్గొనాలని, తిరిగి గమ్యం చేరాలని ఆయన కోరారు.