ఉపాధి హామీలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు
ప్రతి కూలీకి 125 రోజుల పని కల్పించాలి
అడిషనల్ డీఆర్డీఓ సురేందర్
గణపురం,(విజయక్రాంతి): ఉపాధి హామీ పథకం అమలులో అవకతవకలకు పాల్పడితే సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ డీఆర్డీఓ సురేందర్ హెచ్చరించారు. పని అడిగిన ప్రతి కూలీకి 125 రోజుల పని కల్పించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం గణపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఎల్. భాస్కర్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం 18వ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు.
మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో 2025–26లో చేపట్టిన పనులపై సామాజిక తనిఖీ నివేదికలను డీఆర్పీలు ప్రజావేదికలో చదివి వినిపించారు. మండలంలో రూ.2.76 కోట్ల కూలీల వేతనాలు, రూ.31 లక్షల వస్తు సామగ్రి చెల్లింపులు జరిగినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ హాజరు పట్టికల్లో కొట్టివేతలు, ఇతరుల స్థానంలో సంతకాలు చేయడం వంటి అక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరించారు.
పనులు ప్రారంభించే ముందు గ్రామ పంచాయతీ తీర్మానాలు చేయడంతో పాటు పని ప్రదేశాల్లో జీపీఎస్ ఆధారిత ఫొటోలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. వలసలను నివారించేందుకు ప్రతి గ్రామంలో విస్తృతంగా ఉపాధి పనులు చేపట్టాలని తెలిపారు. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి సాంకేతిక, క్షేత్ర సహాయకులకు కలిపి రూ.20,500 జరిమానా విధించారు. కార్యక్రమంలో ఏపీడీ మంజులదేవి, జిల్లా విజిలెన్స్ అధికారి రూబీనా, అంబుడ్స్మెన్ శ్రీనివాస్, ఎంపీఓ శ్రీకాంత్, ఏపీఓ రాజు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.