సిటీ ట్రాఫిక్‌కు మరో వన్‌వే పరిష్కారం

06-11-2026 | 09:51pm

హైదరాబాద్: కేబీఆర్ పార్క్ వద్ద వన్ వే ఫలితాలతో మరో ప్రాంతంలో వన్ వేకు పోలీసులు కసరత్తులు చేస్తున్నారు. లక్డీకాపూల్(Lakdikapul) పరిసరాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కొత్త ప్రణాళికలు చేశారు.  ట్రాఫిక్‌ను మరింత సులభతరం చేసి, వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా చేసేందుకు ఇవాళ లక్డీకాపూల్ పరిసరాల్లో సీపీ సజ్జనార్(CP Sajjanar) బైక్‌పై క్షేత్రస్థాయిలో పర్యటించారు. ద్వారకా హోటల్‌, పాత సైఫాబాద్‌ పీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇక్బాల్‌ మినార్‌, రవీంద్రభారతి, ఓల్డ్ కంట్రోల్ రూమ్ జంక్షన్లలో రోడ్ల స్థితిగతులు, రద్దీ తీవ్రతను పరిశీలించారు. 

ఆయా కూడళ్లలో ట్రాఫిక్‌(Traffic) సమస్యలకు చెక్ పెట్టేలా కొత్తగా వన్‌-వే విధానం అమలుకు గల సాధ్యాసాధ్యాలను సమీక్షించామని,  హెచ్డీఎఫ్సీ, పాత సైఫాబాద్ పీఎస్, ఇక్బాల్ మినాల్ మీదుగా వాహనాలు మళ్లింపు. రవీంద్రభారతి, సచావాలయం జంక్షన్ల వద్ద ట్రాఫిక్ మార్గాల్లో మార్పులకు ప్రతిపాదనలు చేసినట్లు ఆయన వెల్లడించారు. 

ఈ విధానంపై త్వరలోనే జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు, విద్యుత్‌ శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. వాహనదారులకు ఇబ్బంది లేకుండా తొలుత దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని సీపీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఇతర రద్దీ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్‌ సరళీకరణకు వన్‌-వేలను పరిశీలిస్తున్నామని, ట్రాఫిక్‌ నిపుణులతో నిరంతరం చర్చిస్తూ ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మెరుగైన ట్రాఫిక్‌ నిర్వహణకు నగరవాసులు సహకరించాలని సీపీ సజ్జనార్ కోరారు.


మరిన్ని వార్తలు