కాకతీయుల నిర్మాణ కౌశలం అద్భుతం

06-11-2026 | 10:30pm

ప్రసాద్ పథకం పనులపై ఆరా

రామప్ప ఆలయాన్ని సందర్శించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్

వెంకటాపూర్, నవంబర్ 06 (విజయక్రాంతి): రామప్ప దేవాలయ(Ramappa Temple) శిల్పకళ, నిర్మాణ కౌశలం నాటి సాంకేతిక నైపుణ్యానికి అద్దం పడుతున్నాయని రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్(Special Chief Secretary Jayesh Ranjan) అన్నారు. శుక్రవారం మండలంలోని ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయాన్ని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు(Collector Borkhade Hemant Sahadev Rao), జిల్లా అటవీ అధికారి వికాస్ మీనాతో కలిసి సందర్శించారు.

ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గైడ్ విజయ్ కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళా విశిష్టత, నిర్మాణ రహస్యాలను వివరించారు. నీటిలో తేలియాడే ఇటుకలు, డోలరైట్, బసాల్ట్, ఇసుకరాయి వినియోగం, సాండ్‌బాక్స్ సాంకేతికత గురించి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆసక్తిగా తెలుసుకున్నారు. ఆలయ శిల్పాల్లో నాటి జీవన విధానం, వస్త్రధారణ, కళలు, ఆటలను ప్రతిబింబించిన తీరు అద్భుతమని ప్రశంసించారు.

అనంతరం ఆలయ కార్యనిర్వహణ అధికారి ఇమ్మడి భాస్కర్ శాలువాతో సన్మానించారు. ప్రసాద్ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, భక్తులు, పర్యాటకులకు కల్పిస్తున్న సదుపాయాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ గిరిబాబు, ఎంపీడీవో రాజు, ఎస్సై రాజు, డిప్యూటీ రేంజ్ అధికారి మధుబాబు, ఆర్‌ఐ రమేష్, జీపీఓ సూరయ్య, పర్యాటక పోలీసులు దశరథ్, శ్రీనివాస్, అరుణ్, శ్రీకాంత్, బద్రు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు