సర్ సిల్క్ వాసులు అధైర్య పడొద్దు
ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు
కాగజ్ నగర్,(విజయక్రాంతి): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా(Komaram Bheem Asifabad District) కాగజ్ నగర్ పట్టణంలోని సర్ సిల్క్ బాధితులు అధైర్య పడద్దని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు(MLA Harish Babu) అన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూతపడ్డ సర్ సిల్క్ మిల్లు(Sirsilk Mill) స్థలాల్లో గత 50 సంవత్సరాల పైన నివాసాలు ఏర్పరచుకొని ఉంటున్న వారికి రెవెన్యూ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. దాదాపు 3 వేల పైచిలుకు నివాసం ఉంటున్న వారికి ఇండ్లు ఖాళీ చేయాలని నోటీసులో పేర్కొన్నారు.
ఈ విషయంపై ఎమ్మెల్యే మాట్లాడుతూ... గతంలో మిల్లు మూతపడిన సందర్భంగా ఈ స్థలాలను వేలం పాటలో దక్కించుకున్న వ్యక్తి కోర్టును ఆశ్రయించడంతోనే ఈ నోటీసులు పంపిణీ చేయబడ్డాయని అన్నారు. తనకు సైతం రెవెన్యూ అధికారులు నోటీస్ అందించినట్లు తెలిపారు. ఈ విషయంలో బాధితులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని.. హైకోర్టు లిక్విడ్ లెటర్ తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే ప్రభుత్వం దృష్టి కి సైతం తీసుకెళ్లి బాధితులకు అండగా ఉంటానని పేర్కొన్నారు.