ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గా ఉర్సు షురూ
పోలీస్ స్టేషన్ నుంచి వైభవంగా గంధం ఊరేగింపు
వేలాదిగా తరలివచ్చిన భక్తులు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మతసామరస్యానికి ప్రత్యేకంగా నిలిచిన అర్వపల్లి శివారులోని హజ్రత్ సయ్యద్ ఖాజా నసీరుద్దీన్ బాబా రహ్మతుల్లా అలై(Hazrat Syed Khaja Naseeruddin Baba Rahmatullah Alai) 51వ సందల్ ఉర్సు ఉత్సవాలు శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. రాత్రి 7 గంటలకు అర్వపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గంధం ఊరేగింపు ప్రారంభమైంది. స్టేషన్లో ప్రార్థనలు జరిపిన అనంతరం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు(MLA Mandula Samelu), వక్స్ బోర్డు రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ అమీర్ అహ్మద్,జిల్లా ఇన్స్పెక్టర్ దస్తగిరి, సీఐలు నర్సింహారావు, రాజశేఖర్ స్థానిక మత పెద్దలు, నాయకులు గంధం పాత్రలను తలపై పెట్టుకుని ముస్లిం ఆచారాలకు అనుగుణంగా నడిచారు.ఊరేగింపుకు ముందు ఫకీర్లు జరబ్ నిర్వహించారు.
ఊరేగింపు సందర్భంగా బాణాసంచా కాలుస్తూ అర్వపల్లి వై జంక్షన్ వరకు కాలినడకన వచ్చి గంధంను సాగనంపారు.ఉర్సుకు ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి బాబాను దర్శించుకుని,మొక్కులు తీర్చుకున్నారు. దర్గా వద్ద రాత్రి ఖవ్వాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడిపల్లి మధుకర్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి వేల్పుల రమేష్, యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ బీరవోలు విక్రంరెడ్డి, చిలంచర్ల విద్యాసాగర్, లూనావత్ కృష్ణనాయక్, శిగ నసీర్ గౌడ్, సైదులు, ఎస్ఐ లు మధు, నాగరాజు, అవిలయ్య, వివిధ పార్టీల నాయకులు, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.