గ్రామాలకు నూతన బస్సు సర్వీసు ప్రారంభం
మూడు గ్రామాలకు నూతన బస్సు సర్వీసు ప్రారంభం
స్వయంగా బస్సు నడిపి ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
ఆలేరు,(విజయక్రాంతి): భువనగిరి మండలంలోని పీబీ తండా, ఏటిబీ తండా, సూరేపల్లి గ్రామాల ప్రజల రవాణా కష్టాలకు పరిష్కారం లభించనుంది. ఆయా గ్రామాల ప్రజల సౌకర్యార్థం ఉప్పల్ ఆర్టీసీ డిపో(Uppal RTC Depot) నుంచి ఏర్పాటు చేసిన నూతన బస్సు సర్వీసును భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbam Anil Kumar Reddy) గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా బస్సు నడిపి సర్వీసును ప్రారంభించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నూతన బస్సు సర్వీసు అందుబాటులోకి రావడంతో మూడు గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభతరం కానున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ బస్సు సర్వీసును ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీబీ తండా సర్పంచ్ బానోతు జ్యోతి-నర్సింహా, పీఏసీఎస్ చైర్మన్ పక్కిర్ కొండల్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లంల జంగయ్య యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.