రైతులకు కరవు సాయమేది?:
హైదరాబాద్: తెలంగాణలో కరవు తాండవిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదని ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి(BRS leader Manne Goverdhan Reddy) విమర్శించారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులకు కరవు సాయం అందించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్లోబల్ సమ్మిట్ లు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండిపోయిన పంట పోలాలనను పరిశీలించి, రైతులను పరామర్శించే తీరిక కూడా ముఖ్యమంత్రికి లేకపోవడం శోచనీయమన్నారు.
కేబినెట్ సమావేశంలోనైనా కరువు పరిస్థితులపై చర్చించారా అని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై మంత్రులకు కనీస బాధ్యత లేదనీ,ప్రజల కష్టాల కంటే కమీషన్లకే కాంగ్రెస్ నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. గ్లోబల్ సమ్మిట్ ప్రచారం కోసం రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నారనే ప్రచారంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు. రైతులకు పరిహారం ఇవ్వలేని ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు వందల కోట్లు ఎలా ఖర్చు చేస్తుందని నిలదీశారు. కరువు పరిహారంగా ఎకరాకు రూ.10 వేలతో సరిపెట్టకుండా కనీసం రూ.30 వేలు అందించాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఘోరంగా ఓడించాలని పిలుపునిచ్చారు.