ఆలేరులో తీన్మార్ మల్లన్న సమరశంఖం!
బీసీల హక్కుల కోసం గర్జించిన మల్లన్న.. కాంగ్రెస్, బీఆర్ఎస్లపై నిప్పులు
బీసీలకు ఏటా రూ.20 వేల కోట్ల నిధులు ఏమయ్యాయి? 42 శాతం రిజర్వేషన్లు ఎక్కడ?
ఆలేరుకు చేరుకున్న బీసీ రాజ్యాధికార యాత్ర.. ఘన స్వాగతం పలికిన టీఆర్పీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఉష..
ఆలేరు, నవంబర్ 10 (విజయక్రాంతి): బీసీలకు(BC) రాజకీయ అధికారం(Political Power) దక్కే వరకు పోరాటం ఆగదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ(Telangana Rajyadhikara Party) అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) స్పష్టం చేశారు. బీసీల హక్కుల సాధనే లక్ష్యంగా చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర మంగళవారం ఆలేరు పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా టీఆర్పీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఉష ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్నకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉష ఆధ్వర్యంలో పట్టణంలోని సాయిబాబా దేవాలయంలో మల్లన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
బీసీల నిధులు ఎక్కడ? రిజర్వేషన్లు ఏమయ్యాయి?
అనంతరం తన ప్రసంగంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీన్మార్ మల్లన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటూ అధికారాన్ని అనుభవిస్తున్న పార్టీలకు ఇకపై బీసీలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ప్రతి సంవత్సరం బీసీల సంక్షేమానికి రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మూడేళ్లకు రూ.60 వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా, ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మాట తప్పారని, బీసీల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ పాలనలోనూ బీసీలకు ఆశించిన న్యాయం జరగలేదని విమర్శించారు. బీసీల జనాభా పెరుగుతున్నా, వారి రాజకీయ ప్రాతినిధ్యం, నిధులు, అవకాశాలు మాత్రం తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇతర పార్టీల దయపై కాదు.. మనకంటూ రాజకీయ అధికారం కావాలి!
బీసీలు ఇతర పార్టీల నాయకుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి మారాలని, మన ఓట్లతో ఇతరులు అధికారంలోకి వస్తుంటే మనకు మాత్రం అధికారం ఎందుకు దక్కడం లేదని ప్రశ్నించారు. బీసీల భవిష్యత్తు కోసం, మన పిల్లల హక్కుల కోసం, మన వర్గాల అభివృద్ధి కోసం సొంత రాజకీయ శక్తిని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలందరూ ఐక్యంగా ముందుకు వచ్చి రాజ్యాధికార పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఆలేరు చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌పై ఉత్కంఠ
తీన్మార్ మల్లన్న ఆలేరు పట్టణానికి చేరుకోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం మరికాసేపట్లో ఆలేరు చౌరస్తాలో నిర్వహించనున్న కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించనున్నారు. బీసీ రిజర్వేషన్లు, నిధుల కేటాయింపు, రాజకీయ రాజ్యాధికారంపై మల్లన్న చేసే ప్రసంగంపై స్థానిక ప్రజల్లో ఆసక్తి నెలకొంది. చింతపండు వెంకటేష్, చెక్క రవి తదితరులు పాల్గొన్నారు.