నాపై కుట్ర జరుగుతోంది.. డీజీపీకి వీసీ ఫిర్యాదు
హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ జానయ్య తనపై వస్తున్న ఆరోపణల వ్యవహారాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు డీజీపీ సీవీ ఆనంద్‌కు లేఖ రాస్తూ సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే ఉద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
తన నిర్ణయంతో మహిళా ప్రొఫెసర్ అసంతృప్తికి గురైందని, బదిలీ చేసినందుకే మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై ఆరోపణలు చేసినట్లు జానయ్య లేఖలో వివరించారు. గత రెండేళ్లుగా విశ్వవిద్యాలయంలో అమలు చేసిన ప్రగతిశీల మార్పులను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
మహిళా ప్రొఫెసర్‌కు సంబంధించిన గత మూడు నెలల కాల్ వివరాలను పరిశీలించాలని వీసీ కోరారు. సాధారణ ఫోన్ కాల్స్‌తో పాటు వీడియో, ఆడియో కాల్స్‌కు సంబంధించిన అంశాలపైనా దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని పేర్కొన్నారు.
తనపై వచ్చిన ఆరోపణలు విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని జానయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపిస్తూ, అన్ని కోణాల్లో విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించాలని డీజీపీని కోరారు.